Sigma | తమిళ స్టార్ హీరో, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ తనయుడు జేసన్ సంజయ్ సినీ రంగంలో దర్శకుడిగా అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. విజయ్ వారసుడిగా హీరోగా ఎంట్రీ ఇస్తాడని అభిమానులు భావించినప్పటికీ, అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ జేసన్ సంజయ్ మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘సిగ్మా’. యువ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ వర్గాల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
‘సిగ్మా’ సినిమాను జూలై 31న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు కొత్త పోస్టర్‌తో వెల్లడించారు. అయితే ప్రస్తుతం తమిళ్ వెర్షన్ రిలీజ్ మాత్రమే అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. సందీప్ కిషన్‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్నప్పటికీ, తెలుగు విడుదలపై మేకర్స్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. విడుదల సమయానికి ద్విభాషా రిలీజ్‌పై మరిన్ని వివరాలు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాలో ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. కామెడీ, గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫరియా.. ఇప్పుడు యాక్షన్ డ్రామాలో సందీప్ కిషన్ సరసన కనిపించనుండటం ఆసక్తికరంగా మారింది.
భారీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమిళ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలకు ప్రసిద్ధి చెందిన ఈ సంస్థ.. జేసన్ సంజయ్ డైరెక్షన్ డెబ్యూపై పూర్తి నమ్మకంతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, కాన్సెప్ట్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా విజయ్ అభిమానులు జేసన్ సంజయ్ తొలి సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. హీరోగా కాకుండా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాలని జేసన్ ప్రయత్నిస్తున్నాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సందీప్ కిషన్ కూడా వరుస ప్రయోగాత్మక కథలను ఎంచుకుంటూ కెరీర్లో కొత్త దిశగా అడుగులు వేస్తున్నాడు. ‘సిగ్మా’లో ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా, కొత్త తరహాలో ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఇక జూలై 31న విడుదల కానున్న ‘సిగ్మా’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి. ముఖ్యంగా విజయ్ కుమారుడు దర్శకుడిగా చేసే తొలి ప్రయత్నం కావడంతో ఈ సినిమా కోలీవుడ్‌లో భారీ చర్చకు దారి తీస్తోంది.