‘తెలుసు కదా’ సినిమాతో ఈ దీపావళికి గట్టిగానే సందడి చేశారు సిద్ధు జొన్నలగడ్డ. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా ‘బ్యాడాస్’ ‘ఇఫ్ మిడిల్ ఫింగర్ వాజ్ ఏ మ్యాన్’ అనేది ఉపశీర్షిక. ఈ బోల్డ్ టైటిల్ ఇప్పటికే చర్చనీయాంశమైంది. అయితే కథ చాలా బావుంటుందనీ, ఇది ఓ నటుడి ప్రయాణమనీ, ఇందులో తండ్రీకొడుకుల ఎమోషన్ అద్భుతంగా ఉంటుందని, ఈ టైటిల్ పెట్టడానికి బలమైన కారణమే ఉందని మేకర్స్ చెబుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే.. ఈ సినిమా తర్వాత సిద్ధూ చేయాల్సిన ‘కోహినూర్’ సినిమా ప్రస్తుతానికి పక్కకు జరగడంతో ‘టిల్లూ క్యూబ్’ ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది.
సిద్ధు జొన్నలగడ్డకు గుర్తింపు తెచ్చిన పాత్ర ‘టిల్లు’. ప్రేక్షకులు కూడా ఆ పాత్రను బాగా ఇష్టపడ్డారు. అందుకే డీజే టిల్లు, టిల్లు స్కేర్ చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. సిద్ధు మళ్లీ ‘టిల్లు’ అవతారం ఎప్పుడు ఎత్తుతాడా?.. అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ‘బ్యాడాస్’ తర్వాత ‘టిల్లు క్యూబ్’ని పట్టాలెక్కించేందుకు సిద్ధు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన టీజర్ కూడా షూట్ చేశారని తెలుస్తోంది. టిల్లుకు సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది? అనే ఐడియాతో ఈ కథ తయారు చేశారట. ఈ ఏడాది చివర్లోగానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ ‘టిల్లు క్యూబ్’ మొదలయ్యే అవకాశం ఉంది.