సినిమా పేరు : 3BHK
తారాగణం: సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని..
దర్శకత్వం: శ్రీగణేశ్
నిర్మాత: అరుణ్ విశ్వ
సిద్ధార్థ్ నటించిన సినిమాలు ఈ మధ్య పెద్దగా ఆడకపోయినా.. తను చేసే సినిమాలు కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా ఉంటాయనే నమ్మకంతో 3BHK సినిమా కోసం ఓ తరహా ఆడియన్స్ ఎదురుచూశారు. పైగా టైటిల్ కూడా సినిమాపై ఆసక్తి పెరగడానికి ఓ కారణం అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా చూడాలని ఎదురు చూసిన ప్రేక్షకులకు 3BHK ఎలాంటి అనుభవాన్నిచ్చింది? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్లాలి.
కథ
వాసుదేవన్(శరత్‌కుమార్) ఓ మధ్య తరగతి వ్యక్తి. భార్య ఇద్దరు పిల్లలు.. ఇదీ అతని జీవితం. సొంతిల్లు కట్టుకోవాలనేది అతని కుటుంబం యాంబిషన్. కానీ అనుకోకుండా ఎదురయ్యే అవసరాలు, పిల్లలు ఎదిగే కొలదీ ఎదురయ్యే బాధ్యతలు వాసుదేవన్ని ఓ ఇంటివాడ్ని కాకుండా చేశాయి. సొంతింటి కల తీరకముందే వాసుదేవన్ వృద్ధాప్యంలోకి అడుగుపెట్టాడు. తండ్రి కలను నెరవేర్చే బాధ్యతను కొడుకు ప్రభు (సిద్ధార్థ్) తీసుకున్నాడు. విద్యార్థిగా అవాంతరాలన్నింటినీ అధిగమించి ఉన్నత విద్యను పూర్తి చేసిన ప్రభు, ఎలాగొలా ఓ ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. మరి ప్రభు అయినా తండ్రి కలను నిజం చేశాడా? సొంతింటి కలను నిజం చేసే క్రమంలో ఈ కుటుంబానికి ఎదురైన అనుభవాలేంటి? అనేది మిగతా కథ.
విశ్లేషణ
సొంత ఇంటికల నిజం చేసుకునేందుకు ఓ మధ్య తరగతి కుటుంబం ఆరాటం ఈ సినిమా. 37ఏండ్ల క్రితం అచ్చు ఇదే కథతో విస్సు దర్శకత్వంలో ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ అనే సినిమా వచ్చింది. ఇలాంటి కథలను వినోదాత్మకంగా చెప్పడం నిజంగా కత్తిమీద సామే. ఎందుకంటే.. కష్టాలు కడగళ్లను చూసేందుకు ప్రస్తుతం ప్రేక్షకులు ఇష్టపడటం లేదు. రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకొని వెళ్లేందుకే ఆడియన్స్ సినిమాలకు వస్తున్నారు. కథలో సీరియస్‌నెస్ ఉన్నా.. నడకలో వినోదం ఉండాలి. అప్పుడే ఇలాంటి సినిమాలు ఆడతాయి. ఈ విషయంలో దర్శకుడు శ్రీగణేశ్ కాస్త తడబడ్డాడనే చెప్పాలి. దానికి తోడు సినిమా కూడా చాలా స్లోగా సాగింది. కానీ దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ మాత్రం చాలా మంచి కాన్సెప్ట్. మధ్య తరగతి జీవితాలను అద్దంపట్టే సన్నివేశాలను రాసుకోవడంలో దర్శకుడు కొంతమేర సక్సెస్ అయ్యాడు. ప్రతి ఒక్కరూ తమ జీవితాలను గుర్తుచేసుకునేలా కొన్ని సన్నివేశాలున్నాయి.
ఎవరెవరు ఎలా చేశారు?
ఈ సినిమాలో మధ్య తరగతి తండ్రిగా శరత్‌కుమార్ చాలా గొప్పగా నటించారు. కళ్లతోనే అద్భుతమైన హావభావాలను పలికించారాయన. వయసు తగ్గ పాత్ర కావడంతో పాత్రలో జీవించారు శరత్‌కుమార్. అలాగే దేవయాని కూడా ఉన్నంతలో చక్కగా నటించారు. ఇక సిద్ధార్థ్ అభినయం ఈ సినిమాకు ప్రధానబలం. తను కోరుకున్న చదువు, తను అనుకున్న జీవితం ఏదీ తనకు దక్కకపోవడంతో మానసికంగా నలిగిపోయే ఓ సామన్య యువకుడిగా ఆయన చూపించిన నటన నిజంగా అభినందనీయం. పాత్రలోని సంఘర్షణలను అనుభవిస్తూ సిద్ధార్థ్ అభినయించారు. ఇంకా చెల్లెలుగా నటించిన మేతా రఘునాధ్, కథానాయికగా నటించిన చైత్ర ఆచార్ అభినయం కూడా బావుంది.
సాంకేతికంగా
దర్శకుడు రాసుకున్న కథ పాతదే. కథనం మాత్రం కొత్తగా ఉంది. అయితే దాన్ని కాస్తంత వినోదాత్మకంగా తీస్తే ఇంకా బావుండేది. ఈ సినిమా విషయంలో అభినందించవలసినది కెమెరా. జితిన్ స్టానిస్లాస్ కెమెరా పనితనం చాలా నాచురల్‌గా ఉంది. లైటింగ్ కూడా ఎంత అవసరమో అంతే వాడారాయన. దాంతో తెర వాస్తవానికి అద్దం పట్టినట్టు కనిపించింది. అమృత రామ్‌నాథ్ నేపథ్యసంగీతం బావుంది. ఎడిటర్ గణేశ్ శివ తన పని సరిగ్గా చేయలేదేమో అనిపించింది. అతను చేయాల్సిన పని ఇంకా చాలానే ఉంది. మొత్తంగా 3BHK మంచి సినిమా. ఓ తరహా ప్రేక్షకులకు నచ్చే సినిమా. కుటుంబ కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.
బలాలు
నటీనటుల నటన, కెమెరా, నేపథ్య సంగీతం
బలహీనతలు
కథ, కథనం, ఎడిటింగ్..
రేటింగ్
2.5/5