ఉత్తమమైన కోరికలు మనిషిని ఉన్నతుడ్ని చేస్తాయి. అబ్దుల్ కలాం కూడా కలలు కని, వాటిని సాకారం చేసుకోమన్నారు. అయితే.. చాలామంది కలలైతే కంటారు కానీ, వాటిని నిజం చేసుకునే ప్రయత్నాలు మాత్రం చేయరు. కమల్ అందుకు మినహాయింపు. ఇటీవల తన కుమార్తె శ్రుతీహాసన్‌తో నిర్వహించిన ఇంటర్వ్యూలో చిన్నవయసులో తన కోరికల చిట్టా గురించి మాట్లాడారు. పనిలో పనిగా బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ కోరికల గురించి కూడా ఫన్నీ కామెంట్స్ చేశారు.
‘చిన్నప్పుడు మా ఇంట్లోనే నాకు ఓ గదిని కేటాయించారు మా నాన్న. నేను తెలివైన వాడ్ని అని ఆయన ప్రగాఢ నమ్మకం. నేనేమో ఆ గదిలో ఒంటరిగా పడుకొని కలలు కనేవాడ్ని. ఎలాగైనా పెద్దయ్యాక నెలకు ఓ పదివేలు జీతం వచ్చే ఉద్యోగం చేయాలని, కారు కొనాలనీ, కొడై కెనాల్లో ఇల్లు కట్టాలనీ.. ఇవన్నీ చేయాలంటే ఏంచేయాలి? అంటూ ఆలోచిస్తూ అలాగే నిద్రపోయేవాడ్ని. పెద్దయ్యాక బాగా సంపాదించా.
కావల్సినంత డబ్బు, లగ్జరీ లైఫ్ అన్నీ పొందా. కొడైకెనాల్లో భవంతి విషయంలో మాత్రం పునరాలోచించాల్సి వచ్చింది. ఎందుకంటే.. నా వర్క్ అంతా చెన్నయ్‌లో. కొడైకెనాల్ వెళ్లినా ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేదు. అలాంటప్పుడు అక్కడ ఇల్లెందుకు? అందుకే విరమించుకున్నా. ఇప్పుడైతే నాకెలాంటి కోరికలూ లేవు’ అని తెలిపారు. షారుక్ గురించి మాట్లాడుతూ ‘చిన్నతనంలో షారుక్ కోరికల లిస్ట్‌ను ఇటీవలే అతని ఇంటర్వ్యూలో విని ఆశ్చర్యపోయాను. తనది నాకంటే పెద్ద లిస్ట్. తనకు విమానం కొనాలని ఉండేదట. అది విని నవ్వుకున్నాను. నిజానికి అతనికి విమానం అక్కర్లేదు. కానీ ఓ గోల్‌గా పెట్టుకున్నందుకు అభినందించాలి’ అన్నారు కమల్‌హాసన్.