Shrasti Verma | స్టార్ డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి, అతనిపై కేసు పెట్టిన శ్రష్ఠి వర్మ ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా గుర్తింపు పొందిన శ్రష్ఠి, జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ గా పలు సంవత్సరాలు పని చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అతనిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ పోలీస్ కేసు పెట్టి సంచలనం సృష్టించింది. ఈ కేసుతో జానీ మాస్టర్ అరెస్ట్ అయి, జైలు కూడా వెళ్లి వచ్చారు. అయితే జానీ భార్యతో పాటు ఆయన అభిమానులు ఈ ఆరోపణలు ఖండించగా… శ్రష్ఠి మాత్రం తన వాదనలపై స్ట్రాంగ్‌గా నిలబడి పలు ఇంటర్వ్యూల్లో ఆరోపణలను మరింత వివరంగా వెల్లడించింది. ఈ వ్యవహారం పూర్తిగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో శ్రష్ఠి పేరు ఒకటే మారుమోగిపోయింది.
ఇప్పుడు ఆమె గురించి మరో హాట్ టాపిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో శ్రష్ఠి వర్మ పాల్గొనబోతుందన్న వార్తలు బయటకొచ్చాయి. ఇప్పటికే ఈ రియాలిటీ షోకు సంబంధించి కొంతమంది సెలబ్రిటీలను ఫైనల్ చేసినట్టు తెలుస్తుండగా, శ్రష్ఠి వర్మ కూడా ఆ లిస్టులో ఉన్నట్లు బిగ్ బాస్ వర్గాల సమాచారం. ఈమె బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడితే… ఆమె గత అనుభవాలను, వివాదాలను ఆధారంగా చేసుకుని షోకి భారీగా ఎమోషనల్ డ్రామా, టీఆర్పీ రేటింగ్స్‌ను తేవాలని మేకర్స్ భావించడంలో ఆశ్చర్యం లేదు. శ్రష్ఠి ఇప్పటివరకు ఈ బిగ్ బాస్ వార్తలపై స్పందించలేదు.అయితే, ఆమె బిగ్ బాస్‌కు వెళ్తే… షోలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగుచూస్తాయో, ఎలాంటి సంచలనాలకు వేదిక అవుతుందో చూడాల్సిందే.
ప్రస్తుతం ఈ బజ్‌తో బిగ్ బాస్ 9పై ప్రేక్షకుల్లో ఉత్కంఠ మరింతగా పెరిగింది. ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లోకి సామాన్యులు కూడా అడుగుపెట్టనున్నారు. లక్షల సంఖ్యలో అప్లికేషన్లు అందుకోగా, నిర్వాహకులు, వాటిలోంచి కఠినమైన సెలెక్షన్ ప్రక్రియ తర్వాత 45 మందిని ఫైనల్ చేశారు. ఈ 45 మందిలోంచి టాప్ 15ని ఎంపిక చేసేందుకు ఓ అగ్నిపరీక్ష మాదిరిగా టాస్కులు పెడుతున్నారు. ఈ షోకి హోస్ట్‌గా ఎనర్జిటిక్ శ్రీముఖి వ్యవహరిస్తుండగా , జ్యూరీగా నవదీప్, బిందుమాధవి, అభిజిత్ వంటి స్టార్లు వ్యవహరించారు.