Shraddha Kapoor | తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్. రూపానికి తగ్గ దుస్తుల్లో కనిపిస్తూ కుర్రకారు మతిపోగొడుతుంటుంది. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఈ అమ్మడు ఇటీవల తన పెళ్లి గురించి చేసిన పోస్ట్‌కు భారీగా స్పందిస్తున్నది ఆమె అభిమానగణం. ‘నేను పెళ్లి చేసుకోవాలా?’.. అంటూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చేసిన పోస్ట్‌తో సోషల్ మీడియాలో సంచలనానికి తెర తీసింది.
తొలుత సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫొటోలను వరుసగా పోస్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ‘నేను ఎలా ఉన్నాను.. పెళ్లి చేసుకోవాలా?’ అని అభిమానులను అడిగింది. దీంతో ఆమె ఇన్‌స్టా అకౌంట్‌ను కామెంట్ల వరద ముంచెత్తుతున్నది. అభిమానులే కాదు సంగీత దర్శకుడు దర్శన్ రావల్ కూడా ఈ పోస్ట్ కింద కామెంట్ చేయడం విశేషం. శ్రద్ధా కపూర్ చివరగా రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ‘తూ జూఠీ మైన్ మక్కర్’లో జత కట్టింది. తన తదుపరి చిత్రాలు ‘నాగిన్’, ‘చల్బాజ్ ఇన్ లండన్’లో కనిపించనున్నది. ఆమె నటించిన ‘స్త్రీ-2’ కూడా ఆగస్టులో విడుదలకు సిద్ధంగా ఉన్నది.