తెలుగులో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘కన్నప్ప’ ఒకటి. మహాపుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి స్థల పురాణం ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నది. ఇందులో కన్నప్పగా మంచు విష్ణు నటిస్తున్నారు. గతంలో ఈ పాత్రను కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, రెబల్‌స్టార్ కృష్ణంరాజు పోషించి మెప్పించారు. ఇప్పుడు మంచు విష్ణు పోషిస్తున్నారు. ఇది ఓ విధంగా సాహసమే. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్, శరత్‌కుమార్ ఇలా పెద్ద పెద్ద స్టార్లు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఈ చిత్రం షూటింగ్ న్యూజిలాండ్‌లో శరవేగంగా జరుగుతున్నది. పాన్ఇండియా స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత మోహన్‌బాబు భావిస్తున్నట్టు సమాచారం. ముఖేశ్‌కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. నేడు మంచు విష్ణు పుట్టిన రోజు. లొకేషన్లో ఘనంగా ఆయన బర్త్‌డే వేడుక జరుగనున్నట్టు సమాచారం.