Shobha Shetty | కన్నడ, తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి శోభా శెట్టి.. “కార్తీక దీపం” సీరియల్లో ‘మోనిత’ పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అనంతరం కన్నడ బిగ్‌బాస్ సీజన్ 11లో కూడా పాల్గొంది. అయితే, ఆ షోలో హోస్ట్ కిచ్చా సుదీప్తో తలెత్తిన ఘర్షణపై ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. నాకు మొదట బిగ్‌బాస్ కన్నడ కోసం అడిగినప్పుడు, నేను ఇప్పటికే తెలుగు బిగ్‌బాస్ చేశానుగా అని మానుకున్నాను. కానీ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అవకాశం ఇచ్చారు. అప్పట్లో నాకు కన్నడలో ఆఫర్లు తగ్గిపోయి, నేను ఖాళీగా ఉండడంతో ఒప్పుకున్నాను.
కానీ హౌజ్‌లోకి వెళ్లిన రెండు వారాల తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. దాంతో నేను స్వయంగా ఎలిమినేట్ కావాలని నిర్ణయం తీసుకున్నాను. ఇలా షో నుంచి నిష్క్రమించాలనుకున్నపుడు సుదీప్ సర్ ఫైర్ అయ్యారు. ‘మీరు టాప్ 2లో ఉన్నారు, మీకు ఓట్ వేసిన ప్రేక్షకులను ఎలా నిరాశపరుస్తారు?’ అంటూ ప్రశ్నించారు. కానీ నేను స్పష్టంగా చెప్పాను. నా ఆరోగ్యం నాకు ముఖ్యమని. డబ్బు, ఫేమ్ తర్వాత వస్తాయి, కానీ ఆరోగ్యం ఉంటేనే అది అన్నీ సాధ్యమవుతాయి. నేను ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా లేను, అందుకే కొనసాగలేను అని చెప్పుకొచ్చాను. బిగ్‌బాస్ టీమ్ కూడా నన్ను మెచ్చుకుని షోలో ఉండాలని అన్నారు. కాని నేను ఒప్పుకోలేదు.
అయితే ఆ సమయంలో నేను లోపల ఎక్కువ రోజులు ఉండటం మానసికంగా నన్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. సుదీప్ సర్ చెప్పింది తప్పు కాదు, కానీ నా పరిస్థితులు నాకే తెలుసు. బయటకు వచ్చిన తర్వాత ఈ వ్యవహారం గురించి చాలా బాధపడిపోయాను. అప్పుడు యశ్వంత్ (నా కాబోయే భర్త) నన్ను మళ్లీ మానసికంగా బలంగా తయారుచేశాడు, అని శోభా తన మనసులోని బాధను చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్ షోలో ఫిజికల్, మెంటల్ స్ట్రెయిన్స్ గురించి ఆమె చెప్పుకు రాగా, ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే శోభా కొనసాగి ఉంటే ఆమె తప్పక టాప్ 3లో నిలిచేది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.