Shivaji | ఇటీవల ‘దండోరా’ సినిమా ఈవెంట్లో హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అమ్మాయిలు మంచి బట్టలు వేసుకోవాలంటూ మాట్లాడే క్రమంలో అనుకోకుండా రెండు అసభ్యకరమైన పదాలు వాడటం సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఈ వ్యవహారం మహిళా కమిషన్ వరకు వెళ్లడంతో శివాజీకి నోటీసులు జారీ అయ్యాయి. దీనికి స్పందిస్తూ నేడు మహిళా కమిషన్ ముందు హాజరైన శివాజీ, విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. మహిళా కమిషన్ విచారణ తర్వాత శివాజీ మాట్లాడుతూ… తాను సినీ పరిశ్రమలో ఎన్నేళ్లుగా ఉన్నప్పటికీ ఎవరినీ ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టలేదని అన్నారు.
నేను నిజంగా తప్పు చేసి ఉంటే ఇంతకుముందే నా మీద ఫిర్యాదులు వచ్చేవి. కానీ అలా జరగలేదు. నాతో సన్నిహితంగా ఉండి, నా నటనను పొగుడుతూ ఉన్నవాళ్లే ఇప్పుడు నా మీద మీటింగ్స్ పెట్టి కుట్ర చేస్తున్నారు అని ఆరోపించారు. తాను ఆవేశంలో అన్న రెండు పదాలకు ఇప్పటికే క్షమాపణలు చెప్పానని, అయినా కూడా వివాదం ఆగకపోవడం బాధ కలిగిస్తోందన్నారు. మహిళా కమిషన్ చైర్మన్ చాలా హుందాగా వ్యవహరించారని శివాజీ చెప్పారు. ఆవిడ తన డ్యూటీ చేశారు, నేను వచ్చి సమాధానాలు చెప్పాను. ఎవరు బట్టలు ఎలా వేసుకుంటే నాకు ఏమి సంబంధం? అది వారి ఇష్టం. నేను ఒక తండ్రిగా, నా బిడ్డలే అన్న భావనతో మంచి మాట చెప్పాను. ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లలకు మంచిచెడులు చెబుతారు కదా అని వ్యాఖ్యానించారు. తన మీద ఇంత జెలసీ ఎందుకు వస్తోందో అర్థం కావడం లేదని అన్నారు.
సినిమా పబ్లిసిటీ కోసం తాను ఇలా మాట్లాడానని కొందరు అంటున్నారని పేర్కొంటూ, ఆ ఆరోపణలను శివాజీ ఖండించారు. “నాకు డబ్బు, ఫేమ్ పిచ్చి ఉంటే రాజకీయాల్లో ఎక్కడో ఉండేవాడిని. సినిమా పబ్లిసిటీ కోసమే చేస్తే 13 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉంటానా?” అని ప్రశ్నించారు. మహిళా కమిషన్ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చానని, అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పారని తెలిపారు. ఇక నాగబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ… తాను ఇంకా ఆయన వ్యాఖ్యలు పూర్తిగా వినలేదని, అందుకే ఇప్పుడే స్పందించలేదన్నారు. “నేను అన్న మాటల్లో ఏది తప్పు అనిపిస్తే దానికే సారీ. మంచి చెప్పడం కూడా తప్పే అని ఇప్పుడు అర్థమైంది. నన్ను బెదిరించినా, వార్నింగ్స్ ఇచ్చినా భయపడను. విలువలు లేని బతుకు నేను బతకట్లేదు” అని స్పష్టం చేశారు. తనపై కుట్రలు చేయాల్సిన అవసరం లేదని, సినిమా అవకాశాలు ఇవ్వకపోయినా తనకు జీవనాధారం ఉందని శివాజీ అన్నారు. “నాకు 30 ఎకరాల భూమి ఉంది. సినిమా ఛాన్సులు లేకపోతే వ్యవసాయం చేసుకుంటా. అన్నిటికీ కాలం, కర్మే సమాధానం చెబుతుంది” అంటూ తన వ్యాఖ్యలను ముగించారు.