Bastian In Bengaluru | బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి చెందిన ప్రముఖ రెస్టారెంట్ ‘బాస్టియన్’ (Bastian) బెంగళూరుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అనుమతించిన సమయం కంటే ఎక్కువసేపు కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు, అర్ధరాత్రి పార్టీలకు అనుమతించి నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను బెంగళూరు పోలీసులు ఈ రెస్టారెంట్‌పై ఎఫ్.ఐ.ఆర్. (FIR) నమోదు చేశారు. అయితే రెస్టారెంట్‌పై కేసు నమోదు చేయడంపై శిల్పశెట్టి తీవ్రంగా స్పందించింది. ఈ రెస్టారెంట్‌పై వచ్చిన వార్తలను శిల్పా శెట్టి ఖండిస్తూ.. బుధవారం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది.
”తమపై తమ రెస్టారెంట్‌పై వస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవని. కొందరూ కావాలనే తమ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఈ వివాదానికి క్రిమినల్ రంగు పూస్తున్నారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఇప్పటికే తాము హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశాము. ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున మీడియా సంస్థలు సంయమనం పాటించాలని ఆమె కోరారు. తాము దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నామని, దేశ న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని” శిల్పా శెట్టి పేర్కొన్నారు. బిజినెస్మెన్ రంజిత్ బింద్రా స్థాపించిన ‘బాస్టియన్ హాస్పిటాలిటీ’లో 2019లో పెట్టుబడి పెట్టిన శిల్పా శెట్టికి ఇందులో 50 శాతం భాగస్వామ్యం ఉంది. బెంగళూరులో అత్యంత ఖరీదైన పబ్‌లలో ఒకటిగా పేరొందిన బాస్టియన్, ఇప్పుడు వరుస వివాదాలతో వార్తల్లో నిలిచింది.