Shefali Jariwala | ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి మృతి గురించి మరిచిపోకముందే మరొకరు తనువు చాలిస్తుండడం సినీ ప్రియులని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. తాజాగా ప్రముఖ హిందీ నటి, మోడల్ “కాంటాలగా సాంగ్ పాట ఫేమ్ అయిన” షెఫాలి జరివాలా గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందారు. ఆమె వయసు 42 సంవత్సరాలు మాత్రమే. శుక్రవారం ఆమె అస్వస్థతకి గురయ్యారు. షెఫాలి ఛాతీలో బాగా నొప్పి వస్తుందని చెప్పడంతో ఆమె భర్త పరాగ్ త్యాగి వెంటనే ఆమెని అంధేరిలోని బెల్లేవ్యూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.అప్పటికే ఆమె కన్నుమూసినట్టు వైద్యులు తెలియజేశారు. అనంతరం మృతదేహాన్ని కోపర్ ఆసుపత్రికి పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
2002లో ఆశా పరేఖ్ చిత్రంలోని కాంటా లగా పాటతో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది.ఇది పాప్ కల్చర్‌కు సంచలనంగా మారింది. ఈ పాటకు యూట్యూబ్ లో అత్యధిక మిలియన్ వ్యూస్ రావడంతో పాటు సూపర్ హిట్ అయింది. అందుకే షెఫాలిని అభిమానులు ముద్దుగా కాంటా లగా గర్ల్ అని కూడా పిలుస్తుంటారు. ఇక షెఫాలి బిగ్ బాస్ సీజన్ 13లోనూ షెఫాలి పాల్గొంది. ముజ్సే షాదీ కరోగి సినిమా తర్వాత హిందీలో ఆమె మరో సినిమా చేయలేదు. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రాల ప్రధాన పాత్రలలో ముజ్సే షాదీ కరోగి చిత్రం రూపొందగా, ఇందులో షెఫాలీ ప్రత్యేక పాత్రలో కనిపించింది.
ఇక షెఫాలి 2015లో పరాగ్ త్యాగిని వివాహం చేసుకుంది. పరాగ్ త్యాగితో పాటు నాచ్ బలియే 5, నాచ్ బలియే 7 డ్యాన్స్ రియాలిటీ షోలలో కూడా పాల్గొని సందడి చేసింది. అయితే షెఫాలి ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమను, ఆమె అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పాప్ సింగర్ మికా సింగ్ కూగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఆమె మరణంతో నేను చాలా షాక్ అయ్యాను అని అన్నారు. ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా షెఫాలి జరివాలాకి సంతాపం తెలియజేస్తున్నారు.