Shefali Jariwala | ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా మరణంపై వస్తున్న ఊహాగానాల మధ్య పోలీసులు కీలక సమాచారం వెల్లడించారు. ఈ నెల 27న రాత్రి షెఫాలీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణానికి ముందు జరిగిన పరిణామాలపై పోలీసులు విచారణ జరిపారు. సోమవారం (జూన్ 30న) ఆమె మృతికి సంబంధించి పలు వివరాలను వెల్డించారు. ఆమె యవ్వనంగా ఉండేందుకు పలు మాత్రలతో పాటు ఇంజెక్షన్ తీసుకుంటూ వచ్చారన్నారు. జూన్ 27న ఇంట్లో పూజ సందర్భంగా ఉపవాసం ఉన్నారని.. కడుపు ఖాళీగా ఉండగా మందులు తీసుకోవడం బీపీ పడిపోయిందని ఉండవచ్చని.. దాంతో ఒక్కసారిగా సొమ్మసిలిపడిపోయారని చెప్పారు. అదే రోజు మధ్యాహ్నం ఆమె యవ్వనాన్ని కాపాడుకునేందుకు ఇంజెక్షన్ వేసుకున్నట్టు తెలుస్తోందన్నారు. రాత్రి కూడా ఆమె సాధారణంగా తీసుకునే టాబ్లెట్లు తీసుకున్నట్టు సమాచారం ఉందన్నారు.
బీపీ తీవ్రంగా పడిపోవడంతో ఆమె శరీరం కంపించిందని, వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను అంధేరిలోని మల్టీస్పెషాలిటీ హాస్పిటల్కి రాత్రి 11.15కి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ప్రకటించారని పోలీసులు తెలిపారు. రాత్రి 1 గంటకు పోలీసులకు సమాచారం అందగా.. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కూపర్ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఇప్పటివరకు ఆమె భర్త పారాగ్ త్యాగి, తల్లిదండ్రులు, ఇంటి పనిమనిషి సహా 10 మంది వ్యక్తుల వాంగ్మూలాలు నమోదు చేసినట్టు అంబోలి పోలీసులు తెలిపారు. ఇంటిలో ఉన్న ఔషధాలు, ఇంజెక్షన్లను సేకరించేందుకు ఫోరెన్సిక్ బృందంతో కలిసి పోలీసు బృందం ఇంటికి వెళ్లింది. ప్రస్తుతం షెఫాలీ మరణాన్ని ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా (Accidental Death) నమోదు చేశారు. పూర్తి వివరాలకు పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఏవైనా అనుమానాస్పద విషయాలు వెల్లడికాలేదని వివరించారు.