Sharwanand | టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని వాస్తవానికి ఆగస్టు 28న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా చిత్ర యూనిట్ నుంచి వెలువడిన సమాచారం ప్రకారం ఈ సినిమా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. వీఎఫ్ఎక్స్ (VFX) పనులకు మరింత సమయం పడుతుండటంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తుంది. సినిమాలోని విజువల్ స్కేల్, పీరియడ్ వరల్డ్ మరియు యాక్షన్ సీక్వెన్స్‌లను ఎక్కడా రాజీ పడకుండా అత్యుత్తమంగా తీర్చిదిద్దే ఉద్దేశంతోనే ఈ వాయిదా వేసినట్లు తెలిపారు. వీఎఫ్ఎక్స్ పనులు పూర్తిగా పూర్తయిన తర్వాత కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు.
1960ల నాటి ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో ఈ బలమైన కథ సాగనుండగా, ఇందులో శర్వానంద్ ‘గంగా’ అనే అత్యంత ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఆయన సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ కోసం చిత్రబృందం ఏకంగా 30 రోజుల పాటు సాగిన భారీ యాక్షన్ షెడ్యూల్‌ను ఇటీవల విజయవంతంగా పూర్తి చేసింది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.