సెట్లోకి ఆలస్యంగా రావడం.. శత్రుఘ్న్ సిన్హాకు ఓ అలవాటుగా ఉండేదని అలనాటి లెజెండరీ నటి షర్మిలా ఠాగూర్ గుర్తుచేసుకున్నది. తాజాగా, చిత్రసీమకు సంబంధించిన కొన్ని మరపురాని సంఘటనలను తన అభిమానులతో పంచుకున్నది. 1980లో వచ్చిన హిట్ సినిమా ‘దోస్తానా’ గురించీ, ఆ సినిమా షూటింగ్లో జరిగిన కొన్ని సంఘటనలనూ వివరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “దోస్తానా చిత్రంలో అమితాబ్ బచ్చన్ – శత్రుఘ్న్ సిన్హా కలిసి నటించారు. అయితే.. వీరిద్దరి సమయపాలన వేరువేరుగా ఉండేది. అమితాబ్ సమయానికి ముందే సెట్‌కు వచ్చేవారు. శత్రుఘ్న్ మాత్రం ఎప్పుడూ ఆలస్యమే! ఒకటి రెండుసార్లు కాదు.. నిత్యం అదే తంతు! ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షెడ్యూల్ ఉండేది.
అమితాబ్ షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్లేటప్పుడు.. శత్రుఘ్న్ సెట్‌కు వచ్చేవారు. దాంతో.. ఇద్దరూ కలిసి నటించే సీన్స్ తీయడం.. డైరెక్టర్ రాజ్ ఖోస్లాకు తలనొప్పిగా మారేది. చాలా సీన్లలో డూప్‌తోనే నెట్టుకురావాల్సి వచ్చింది. షూటింగ్ విషయంలోనే కాదు.. అన్ని సందర్భాల్లోనూ ఆయనకు ఆలస్యం ఓ అలవాటుగా ఉండేది. ఎంతలా అంటే.. తన సొంత పెళ్లికి కూడా ఆయన ఆలస్యంగానే వచ్చారు. పార్లమెంటేరియన్‌గానూ పంక్చువాలిటీ పాటించలేదు!” అంటూ శత్రుఘ్న్పై సెటైర్లు వేసింది షర్మిలా! అయితే, శత్రుఘ్న్ సిన్హా సెట్లో చాలా సరదాగా ఉండేవాడనీ, తోటివారితో ఎంతో ప్రేమపూర్వకంగా మెలిగేవాడనీ.. మొత్తానికి ఆయన ఓ అద్భుతమైన వ్యక్తి అనీ కొనియాడింది. కానీ, సమయపాలన మాత్రం పాటించేవాడు కాదని చెప్పుకొచ్చింది.