Shaitan Web-Series Trailer | కరోనా పుణ్యమా అని ఓటీటీలకు ఎక్కడలేని ఆదరణ పెరిగింది. ఒకప్పుడు థియేటర్ల నుంచి వెళ్లిపోయిన సినిమా టీవీల్లో చూడాలంటే కనీసం మూడు నుంచి నాలుగు నెలలు సమయం పట్టేది. కానీ ఓటీటీలు వచ్చాక వారం, రెండు వారాల్లోనే అరచేతిలోకి వచ్చేస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. ప్రతీ వారం కొత్త సినిమా ఏది రిలీజవుతుందా అని తెగ వెతికేస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీల్లో ఈ మధ్య వెబ్ సిరీస్ల ట్రెండ్ ఎక్కువైపోయింది. కంటెంట్ కాస్త ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటే ఐదారు గంటలైనా అలవోకగా చూసేస్తున్నారు. స్టార్ నటీనటులు కూడా వెబ్ సిరీస్లో నటించాలని తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే వెబ్ సిరీస్లు ముఖ్యమైన అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతాయి. దాంతో తమ క్రేజ్ కూడా దేశ వ్యాప్తంగా పెరుగుతుందని భావిస్తున్నారు.
కాగా తాజాగా అలాంటి వెబ్ సిరీస్ ఒకటి విడుదలకు సిద్ధమైంది. ‘యాత్ర’ దర్శకుడు మహి వి రాఘవ్ రూపొందించిన సైతాన్ వెబ్ సిరీస్ జూన్ 15న డిస్నీ+హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ ఉత్కంఠ భరితంగా సాగింది. అయితే కాస్త బోల్డ్ కంటెంట్ ఎక్కువ మోతాదులోనే ఉన్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. డైలాగ్స్ కూడా మరీ పచ్చిగా ఉన్నాయి. ఇక ట్రైలర్ తోనే ఇది కుటుంబంతో కలిసి చూసే విధంగా లేదని స్పష్టమయిపోయింది. అయితే బోల్డ్ విషయం పక్కన పెట్టేస్తే పక్కా రివేంజ్ డ్రామా నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా కొన్ని సీన్లు కూడా చాలా నేచురల్ గా తీసినట్లు కనిపిస్తుంది. అయితే రక్తపాతం మాత్రం అరివీర భయంకర లెవల్లో ఉండబోతున్నట్లు స్పష్టమైంది.
రిషీ, శెల్లి, దేవయాని ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలు పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు విశేష స్పందన వచ్చింది. ఓ కానిస్టేబుల్ తలకు మేకు కొట్టినట్లు ఉన్న పోస్టర్ ఈ వెబ్ సిరీస్ పై తిరుగులేని హైప్ తీసుకొచ్చింది. ఇక ఇటీవలే విడుదలైన సేవ్ ది టైగర్స్ అనే కామెడీ వెబ్ సిరీస్ ను కూడా రూపొందించింది మహి. వి. రాఘవే. ఈ వెబ్ సిరీస్ కూడా ఆశేష ఆదరణ దక్కించుకుంది.