Shah Rukh Khan | ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్, జవాన్ సినిమాలు భారతీయ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. ఈ మూడూ దక్షిణ భారతానికి చెందిన దర్శకులు తీసిన సినిమాలే కావడం విశేషం. భారీ బడ్జెట్ సినిమాను రూపొందించడంలో దక్షిణాది పరిశ్రమ ఎప్పుడూ ముందే ఉంది’ అని షారుక్‌ఖాన్ అన్నారు. స్విట్జర్లాండ్‌లో జరిగిన 77వ లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్టాత్మక ‘పార్డో అల్లా కెరియారా’ అవార్డును షారుక్ అందుకున్న సందర్భంగా అక్కడి మీడియాతో షారుక్ ఆసక్తికరంగా మాట్లాడారు.
‘ భారతీయ సినిమాలో సౌత్ సినిమా నిజంగా ప్రత్యేకం. భారతీయ సినిమా స్థాయిని పెంచిన సూపర్స్టార్లు సౌత్ నుంచి చాలామంది వచ్చారు. దక్షిణాది సినీరంగంలో ప్రతిభావంతులకు కొదవలేదు. అక్కడివారితో కలిసి నేనూ పని చేశాను. మణిరత్నంసార్ దర్శకత్వంలో ‘దిల్సే’లో నటించాను. ఇక అంతకు మించి నటుడిగా నాకేం కావాలి. సౌత్ టెక్నీషియన్స్‌తో కలిసి పని చేయడానికి ఇప్పటికీ ఆసక్తిగా ఉన్నాను’ అని తెలిపారు షారుక్‌ఖాన్.