‘పఠాన్’ చిత్రంతో విజయాల బాట పట్టారు షారుఖ్‌ఖాన్. దాంతో ఆయన తదుపరి చిత్రం ‘జవాన్’ పై భారీ అంచనాలేర్పడాయి. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణం నుంచే అభిమానుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, దీపికా పడుకోన్ వంటి భారీ తారాగణం భాగం కావడంతో ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఉత్సుకతగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ‘జవాన్ ప్రివ్యూ’ పేరుతో టీజర్‌ను విడుదల చేశారు.
షారుఖ్‌ఖాన్ వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ టీజర్ ఆద్యంతం హై ఇంటెన్సిటీ యాక్షన్‌తో ఆకట్టుకుంది. ఇందులో షారుఖ్‌ఖాన్ భిన్న అవతారాల్లో కనిపించి అభిమానులను మెస్మరైజ్ చేశారు. టీజర్లో చిత్ర ప్రధాన తారాగణాన్ని మొత్తం పరిచయం చేయడం ఆకర్షణగా నిలిచింది. భారీ యాక్షన్ ఘట్టాలు, కన్నుల పండువగా సాగిన పాటలు, షారుఖ్‌ఖాన్ డిఫరెంట్ లుక్స్‌తో టీజర్ ఆసాంతం ఆసక్తిని పంచింది. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచింది. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ఈ టీజర్ భారీ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. షారుఖ్‌ఖాన్‌కు ఈ ఏడాది ‘జవాన్’ రూపంలో మరో అద్భుత విజయం ఖాయమని సోషల్‌మీడియాలో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పడుకోన్, సాన్యా మల్హోత్రా, ప్రియమణి, సునీల్ గ్రోవర్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.