SRK60thBirthday | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరో వారం రోజుల్లో తన 60వ పుట్టినరోజు (నవంబర్ 2) జరుపుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు ప్రత్యేక బహుమతిని అందించేందుకు సిద్ధమయ్యారు షారుఖ్. ‘షారుఖ్ ఖాన్ ఫిల్మ్ ఫెస్టివల్(Shah Rukh Khan Film Festival)’ పేరుతో ఆయన నటించిన సూపర్‌హిట్ చిత్రాలను అక్టోబర్ 31 నుంచి థియేటర్లలో మళ్లీ ప్రదర్శించబోతున్నారు. ఈ ఫెస్టివల్లో ‘దిల్ సే’, ‘దేవదాస్’, ‘మై హూ నా’, ‘ఓం శాంతి ఓం’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ వంటి షారుఖ్ కెరీర్‌లోని ఐకానిక్ సినిమాలు రీ-రిలీజ్ కానున్నాయి. షారుఖ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సినిమాల్లోని నా పాత్రలు ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయాయి. నేను మారలేదు, కేవలం జుట్టు మాత్రమే కొంచెం స్టైలిష్‌గా మారింది. ఈ ఫెస్టివల్ ద్వారా అభిమానులతో మళ్లీ ఆ బంధాన్ని పంచుకోవడం ఆనందంగా ఉంది అని తెలిపాడు.
ఈ ఫిల్మ్ ఫెస్టివల్ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 14 వరకు భారతదేశంలోని పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో అలాగే ఉత్తర అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్ దేశాల్లో యశ్‌రాజ్ ఫిల్మ్స్ (వైఆర్ఎఫ్) సహకారంతో ప్రదర్శితం కానుంది. ఇదిలా ఉంటే, షారుఖ్ ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘కింగ్’తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ద్వారా ఆయన కుమార్తె సుహానా ఖాన్ బాలీవుడ్లో నటిగా అరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో షారుఖ్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.