సమంత, దేవ్ మోహన్ జంటగా నటిస్తున్న సినిమా ‘శాకుంతలం’. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. శకుంతల, దుష్యంత మహారాజు అజరామర ప్రేమ కథను ఈ చిత్రంలో చూపించబోతున్నారు.
ఈ చిత్రాన్ని నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం శుక్రవారం ప్రకటించారు. కశ్మీర్ నేపథ్యంగా సాగే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్, ఉన్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించామని మూవీ టీమ్ తెలిపింది. అల్లు అర్హ, సచిన్ ఖేడ్కర్, కబీర్ బేడి, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.