మహాకవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకుని దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. శకుంతల పాత్రలో కథానాయిక సమంత నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘మల్లికా మల్లికా మాలతీ మాలికా.. చూడవా చూడవా ఏడి నా ఏలిక’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. దర్శకుడు మాట్లాడుతూ ‘తన భర్త దుష్యంతుడి కోసం ఎదురుచూసే శకుంతల తన చుట్టూ వున్న మొక్కలు, పక్షులతో మనసులోని బాధను అందంగా వ్యక్తం చేసే పాట ఇది. పాటతో పాటు విజువల్స్ కూడా ఎంతో గ్రాండ్‌గా వుంటాయి. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 17న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అన్నారు.