Sequels | ఇటీవలి కాలంలో ఓ సినిమా హిట్ అయితే దానికి వెంటనే సీక్వెల్స్ ప్లాన్ చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఒక్క తెలుగులోనే కాక ఇతర భాషలలోను సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుంది. అయితే తొలి పార్ట్ మంచి హిట్ అయి సెకండ్ పార్ట్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం కూడా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో చూస్తే సీక్వెల్స్ ఫ్లాప్ అయిన సందర్భాలు చాలా తక్కువ. దాంతో సీక్వెల్ అంటే తెలుగువాళ్లకి ఓ పక్కా ప్లాన్ ఉంటుంది అనే ఫీలింగ్ జనంలో బలంగా నాటుకుపోయింది. బాహుబలితో సీక్వెల్ ట్రెండ్ తెలుగులో మొదలైంది. తొలి పార్ట్ కన్నా రెండో పార్ట్‌కే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి.
ఇక పుష్ప విషయంలోను అదే రిపీట్ అయింది. బన్నీ – సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప రెండో భాగం, దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో ఘన విజయం సాధించింది. చిన్న సినిమాల స్థాయిలోనూ టాలీవుడ్ సీక్వెల్ గేమ్ స్ట్రాంగ్‌గానే ఉంది. హిట్ 2, మత్తు వదలరా లాంటి సినిమాలు కంటెంట్‌తో పేలిపోతే, టిల్లు స్క్వేర్ మొదటి భాగం హంగామా మీదే ట్రేడ్ రికార్డులను బద్దలు కొట్టింది.సీక్వెల్ అనగానే స్కేల్ పెంచి హంగామా చేయకుండా కథని ఇంకాస్త స్ట్రాంగ్‌గా చూపించడంతో మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఈ ట్రెండ్ ఇతర ఇండస్ట్రీలు అమలు చేయలేకపోతున్నాయి.
కోలీవుడ్‌లో ఇండియన్ 2 ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమల్ హాసన్ , శంకర్ వంటి బిగ్ కాంబో కూడా సీక్వెల్ విషయంలో బోల్తా పడ్డారు. ఇక మలయాళంలో చూస్తే లూసిఫర్‌కి సీక్వెల్ గా వచ్చిన ఎంపురాన్ అంత రెస్పాన్స్ దక్కించుకోలేకపోయింది. అయితే కన్నడలో కేజీఎఫ్ సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్ 2 బలంగానే కొట్టింది. ఇది పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ మంచి విజయం సాధించింది. ఇక హిందీలో కూడా కొన్ని సీక్వెల్స్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. ఏది ఏమైన టాలీవుడ్ దర్శకులు బ్రిలియంట్ కాన్సెప్ట్‌తో సీక్వెల్స్‌ని రూపొందిస్తున్నారు కాబట్టి అవి మంచి హిట్స్‌గా నిలుస్తున్నాయి.