హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు తాతినేని రామారావు (Tatineni Rama rao) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యం బాధపడుతున్న ఆయన చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీ, దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ ‘యమగోల’ సినిమాకు తాతినేని దర్శకత్వం వహించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.
తాతినేని రామారావు.. కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో 1938లో జన్మించారు. తెలుగు, హిందీలో 70కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో నవరాత్రి, బ్రహ్మచారి, సుపుత్రుడు, రైతు కుటుంబం, దొరబాబు, ఆలుమగలు, శ్రీరామరక్ష, యమగోల, ఆటగాడు, అనురాగ దేవత, జీవనతరంగాలు, ఇల్లాలు, తల్లదండ్రులు, ప్రెసిడెంట్‌గారి అబ్బాయి వంటి విజయవంతమైన సినిమాలు ఆయన దర్శకత్వంలో తెరకెక్కినవే. వీటితోపాటు హిందీలో లోక్-పరలోక్, అంధా కానూన్, ఇంక్విలాబ్, బేటీ నవంబర్ వన్ వంటి సినిమాలను రూపొందించారు.