సీనియర్ నటుడు జగపతిబాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి తాను అభిమాన సంఘాలకు, ట్రస్ట్‌లకు దూరంగా ఉండబోతున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్‌లో (ట్విట్టర్) ఓ పోస్ట్ చేశారు. ‘నా 33 ఏండ్ల సినీ కెరీర్లో అభిమానులను నా ఉన్నతికి ప్రధాన కారణంగా భావించాను. వాళ్ల కష్టాల్లో తోడుగా, నీడగా నిలిచాను. అభిమానులంటే ప్రేమను అందించే వాళ్లని మనస్ఫూర్తిగా నమ్మాను.
కొంతమంది అభిమానులు ప్రేమకంటే ఆశించటం ఎక్కువైపోయింది. చివరకు నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు. మనసు ఒప్పుకోకపోయినా బాధతో ఓ విషయం చెబుతున్నా. ఇక నుంచి నా అభిమాన సంఘాలకు, ట్రస్ట్‌లతో నాకు సంబంధం లేదు. అయితే నన్ను ప్రేమించే అభిమానులకు మాత్రం నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను’ అని జగపతిబాబు ట్విట్టర్లో పేర్కొన్నారు.