Leader | ఇప్పుడు టాలీవుడ్ (Tollywood)లో రీరిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతున్నదని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్‌తోపాటు పలువురు హీరోల సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. దశాబ్దాల తర్వాత విడుదలైనప్పటికీ రీరిలీజవుతున్న సినిమాల క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడిదే బాటలో మరో సినిమా కూడా నడవనుంది. 2010లో పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా లీడర్ (Leader). రానా ఎంట్రీలోనే సీఎం అర్జున్ ప్రసాద్ పాత్రలో జీవించేసిన తీరును తెలుగు ప్రేక్షకులకు చిరస్థాయిగా గుర్తుండిపోతుంది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఈ సినిమా రీరిలీజ్‌కు కూడా సన్నాహాలు జరుగుతున్నాయన్న వార్త ఆసక్తికరంగా మారింది. 2024 సాధారణ ఎన్నికలలోపు లీడర్ రీరిలీజ్ కానుంది. వచ్చే ఫిబ్రవరి నాటి లీడర్ విజయవంతంగా 14 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 19న థియేటర్లలో మరోసారి విడుదల చేయాలని ఫిక్సయినట్టు ఫిలింనగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. పూర్తి వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు.
ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ్, ప్రియా ఆనంద్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించారు. హర్షవర్ధన్, కోట శ్రీనివాసరావు, రావు రమేశ్, సుబ్బరాజు, గొల్లపూడి మారుతీరావు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. లీడర్‌కు మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ వన్ ఆఫ్ ది స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.