న్యూయార్క్: హాలీవుడ్ హీరోయిన్ స్కార్లెట్ జోహన్సన్(Scarlett Johansson) అత్యధికంగా ఆర్జిస్తున్న నటిగా టైటిల్ నిలబెట్టుకున్నది. ప్రస్తుతం ఆమె నటించిన జురాసిక్ వరల్డ్ రీబర్త్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. హాలీవుడ్ మేటి నటులు రాబర్ట్ డౌనీ జూనియర్, టామ్ క్రూయిజ్లను కూడా దాటేసిందామె. బ్లాక్ విడో చిత్రంలో నటాషా రోమనాఫ్ పాత్రలో ఆమె నటించింది. ఆ పాత్ర నుంచి ఆమెకు భారీగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఐరన్ మ్యాన్ 2, అవెంజర్స్ ఎండ్‌గేమ్ చిత్రాలోనూ స్కార్లెట్ జోహన్సన్ నటించింది.
మ్యారేజ్ స్టోరీ, జోజో రాబిట్, లూసీ, హర్ చిత్రాల్లోనూ ఆమె చేసిన పాత్రలకు మంచి పేరు వచ్చింది. ఆ చిత్రాల్లో జోహన్సన్ తన వైవిధ్య నటనను ప్రదర్శించింది. బాక్సాఫీసు వద్ద కూడా ఆ చిత్రాలు రాణించాయి. సాధారణంగా మేల్ నటుల డామినేషన్ ఉండే హాలీవుడ్లో.. తొలిసారి ఓ హీరోయిన్ టాప్ ప్లేస్ కొట్టేసింది. వాస్తవానికి స్కార్లెట్ ఆర్జనలో మూడవ స్థానంలో ఉంది. కానీ జురాసిక్ వరల్డ్ రీబర్త్ హిట్ కావడంతో ఆమె ఏకంగా ప్రథమ స్థానానికి జంప్ చేసింది.
40 ఏళ్ల స్కార్లెట్ ఇప్పటి వరకు 36 చిత్రాల్లో నటించింది. సామ్యూల్ జాక్సన్ 71, రాబర్ట్ డౌనీ జూనియర్ 45 సినిమాల్లో నటించారు.