Arabia Kadali On Prime | అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి నటించిన ‘తండేల్’ చిత్రం సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన జాలర్లు చేపల వేటకోసమని గుజరాత్ వెళ్లి అక్కడ అనుకోకుండా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించి పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కుతారు. అక్కడ నుంచి వారు ఎలా బయటపడ్డారు, వారికి ఎదురైన సవాళ్లు ఏంటి అనేది ఈ సినిమా స్టోరీ. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇదే కథతో ఇప్పుడు తాజాగా ఒక వెబ్ సిరీస్ వచ్చింది. ప్రముఖ రచయిత చింతకింది శ్రీనివాసరావు (Chintakindi Srinivasarao) మున్నీటి గీతలు (Munniti Geetalu) నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.
ఈ వెబ్ సిరీస్‌కి సూర్యకుమార్ దర్శకత్వం వహించగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కథా రచయితగా, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై వై. రాజీవ్ రెడ్డి, జె. సాయిబాబు నిర్మించగా.. సత్యదేవ్‌తో పాటు, నాసర్, రఘు బాబు, దలీప్ తాహిల్, పూనమ్ బజ్వా, ప్రభావతి, హర్ష రోషన్, ప్రత్యూష సాధు, కోట జయరామ్, వంశీ కృష్ణ, భరత్ భాటియా, చంద్ర ప్రతాప్ ఠాకూర్, డానిష్ భట్, రవి వర్మ, అమిత్ తివారీ, నిహార్ పాండ్యా, అలోక్ జైన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నేటినుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. అయితే ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనేది చూసుకుంటే.
కథ
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. విశాఖపట్నం జిల్లాలోని భీమిలిపట్నం చుట్టూ ఈ కథ జరుగుతుంది. భీమిలిపట్నంలో ఉన్న మత్య్సవాడ, చేపలవాడ అనే రెండు గ్రామాల మధ్య ఎప్పటినుంచో గొడవలు జరుగుతుంటాయి. ఈ రెండు గ్రామాలలో ఉన్న మత్స్యకారుల ప్రధాన వృత్తి చేపలు పట్టడం. అయితే వారికి చేపలు పట్టిన తర్వతా వాటిని తీసుకువచ్చి జెట్టీల (Jetty) దగ్గర ఉంచుదాం అంటే విశాఖలో ఆ సదుపాయం లేదు. దీంతో పని లేక తిండి తిప్పలతో భాదపడుతున్న మత్స్యకారులు అప్పులు తీర్చడానికి సంపాదన కోసం గుజరాత్ వలస వెళ్లి అక్కడ చేపల వేట చేస్తుంటారు.
అయితే గుజరాత్‌కి వలస వెళ్లడానికి ముందు చేపలవాడ నాయకుడు నానాజీ (కోట జయరామ్) కూతురు గంగ (ఆనంది) పొరుగూరి అబ్బాయి బదిరి (సత్యదేవ్) ప్రేమలో ఉంటారు. ఈ విషయం తెలిసిన నానాజీకి బదిరి మీద కోపం వస్తుంది. దీంతో ఆయనకు, గంగకు మధ్య చిన్నపాటి గొడవ జరుగుతుంది. గుజరాత్ వెళ్ళే ట్రైన్లో ఈ గొడవ జరుగుతుండగా.. పోలీసులు వారిని చూసి కిందకు దించేస్తారు. అయితే అక్కడి నుంచి వారు గుజరాత్‌కి ఎలా వెళ్లారు. అక్కడ చేపల వేటకి వెళ్లిన బదిరి అతడి అనుచరులు పాకిస్తాన్ జలాల్లోకి ఎలా వెళ్లారు? అక్కడ పాకిస్థాన్ కోస్ట్ గార్డులకు ఎలా చిక్కారు. వారిని ఇండియా తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలేంటి అనేది ఈ వెబ్ సిరీస్ కథ.
విశ్లేషణ:
‘అరేబియా కడలి’ చూస్తున్నప్పుడు నాగ చైతన్య ‘తండేల్’ సినిమా గుర్తుకు రావడం సహజం. రెండింటిలోని కథాంశం ఒకటే కావడంతో వాటి మధ్య పోలికలు చాలా ఉన్నాయి. ఇక చేపల వేటకు వెళ్లిన భారతీయ మత్స్యకారులు పాకిస్తాన్ కోస్టు గార్డులకు చిక్కడం, వారిని ఇండియాకు తీసుకురావడానికి ఇక్కడి వారు ప్రయత్నించడం. ఇదంత తండేల్ లాగనే ఉంటుంది. అయితే ఈ కథను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తనదైన శైలిలో రూపొందించారు. రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని, రెండు గ్రామాల మధ్య వైరాన్ని సమాంతరంగా చూపుతూ, మానవ సంబంధాల విలువను ఈ సిరీస్‌లో అద్భుతంగా ఆవిష్కరించారు. ఎటువంటి కమర్షియల్ హంగులు లేకుండా, కథను సహజత్వానికి దగ్గరగా చెప్పడం ‘అరేబియా కడలి’ గొప్పతనం. ఇది కేవలం ఒక ప్రేమ కథ కాదు. ఇందులో ప్రేమికులు తమ స్వార్థం కోసం కాకుండా, తమ ప్రాంతం కోసం, తోటి ప్రజల కోసం పోరాడతారు. జెట్టీ నిర్మిస్తే తమ ప్రాంత ప్రజలు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని హీరో భావిస్తాడు. అలా హీరో, హీరోయిన్లకు ఒక ఉన్నతమైన లక్ష్యం ఉంటుంది. ఆ కోణంలో చూస్తే ఈ కథ ‘తండేల్’ కంటే భిన్నంగా నిలిచింది.
నటీనటులు
ఈ సిరీస్‌లో సత్యదేవ్ నటన హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా సత్యదేవ్ విశాఖపట్నం చెందిన వ్యక్తి కావడంతో అక్కడి యాసను అద్భుతంగా పలికించారు. ఈ యాస కథలోని భావోద్వేగాలను ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా చేసింది. గంగ పాత్రలో ఆనంది చాలా సహజంగా నటించి మెప్పించారు. నాజర్, రవి వర్మ, పూనమ్ బజ్వా, దలీప్ తాహిల్ వంటి సీనియర్ నటులు తమ పాత్రలకు మించి సిరీస్‌కు బలం చేకుర్చారు.
సాంకేతికంగా
‘అరేబియా కడలి’ వెబ్ సిరీస్ సాంకేతికంగా చాలా ఉన్నతంగా ఉంది. దర్శకుడు వీవీ సూర్యకుమార్ తెలిసిన కథను కూడా ఆసక్తికరంగా తెరకెక్కించడంలో విజయం సాధించారు. కథలో కొత్తదనం లేకపోయినా, దాన్ని నడిపించిన తీరు ఆయన ప్రతిభకు నిదర్శనం. ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో, ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలను పండించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఈ సిరీస్‌కు ఉన్న ఒకే ఒక్క పెద్ద మైనస్, ఇది ఇటీవల వచ్చిన ‘తండేల్’ కథకు చాలా దగ్గరగా ఉండటం. అయినప్పటికీ, నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి. సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సిరీస్‌ను అత్యున్నత నాణ్యతతో నిర్మించారు. ఇక నాగవెళ్లి విద్యాసాగర్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. సమీర్ రెడ్డి కెమెరా పనితనం అద్భుతం. విజువల్స్ చాలా సహజంగా, అందంగా చిత్రీకరించబడ్డాయి. చాణక్య రెడ్డి తురుపు ఎడిటింగ్ ఈ సినిమాకు చాలా సహాయపడింది.
చివరిగా.. తండేల్ షెడ్స్ ఈ వెబ్ సిరీస్‌పై కనిపించిన ప్రతి విషయాన్ని ఆసక్తికరంగా చూపించారు మేకర్స్. ఈ వీకెండ్లో ప్రేక్షకులు చూడడానికి ఈ వెబ్ సిరీస్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
రేటింగ్ : 3/5