Sathi Leelavathi Teaser | వరుణ్ తేజ్‌ని వివాహం చేసుకొని మెగా కోడలిగా మారింది లావణ్య త్రిపాఠి. 2022లో నటించిన హ్యాపీ బర్త్ డే సినిమా తర్వాత లావణ్య త్రిపాఠి సతీ లీలావతి అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా సతీ లీలావతి టీజర్ విడుదల చేశారు. లవ్, డ్రామా ఎలిమెంట్స్‌తో సాగే ఫన్నీ రైడ్ మాదిరిగా టీజర్ ఉంది. టీజర్ చూస్తుంటే చిత్రాన్ని పురుషులు కూడా గృహ హింసకు బలవుతారనే పాయింట్ చుట్టూ తెరకెక్కించినట్టు అర్ధమవుతుంది. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కొణిదెల ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆమెకు జంటగా మలయాళ హీరో దేవ్ మోహన్ కనిపించనున్నారు. తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దుర్గాదేవి పిక్చర్స్ పతాకంపై నాగమోహన్ నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ దీనిని సమర్పిస్తోంది.
పెళ్లి వేడుకల దృశ్యాలతో టీజర్ ప్రారంభం కాగా , ఆ తర్వాత ఆ దంపతుల మధ్య ఏర్పడే విభేదాలను చూపించారు. “నాకు ఎందుకో హ్యాపీగా లేనప్పుడు… మనం విడిపోవడమే కరెక్ట్ అనిపిస్తుంది” అంటూ దేవ్ మోహన్ డైలాగ్ ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తుంది. అతడిని కుర్చీలో కట్టేసిన సీన్, “లీలా… నన్ను కొడతావా?” అన్న ప్రశ్నకు “ఏం డౌటా?” అంటూ లావణ్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్, కామెడీ టచ్ తో వినోదాన్ని కలిగిస్తుంది. ఇందులో వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్ట రాజేంద్రన్ లాంటి నటులు హాస్యాన్ని మేళవించనున్నారు.
‘భార్యా-భర్తల మధ్య నడిచే మనస్పర్థలు, అనుబంధం, ఆవేశం, వినోదం, భావోద్వేగాలు… అన్ని కలగలిసిన మిశ్రమమే ఈ చిత్రం’ అని మేకర్స్ చెబుతున్నారు. ఇది పూర్తిగా ఆధునిక దృక్కోణంలో తీసిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ‘సతీ లీలావతి’ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. కొంతకాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న లావణ్య త్రిపాఠి సతీలీలావతిగా గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇవ్వనుందని అర్ధమవుతుంది. ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నాడు.