మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ఫాంటసీ హారర్ కామెడీ చిత్రం ‘సర్వంమాయా’ ఇప్పుడు డిజిటల్ సందడికి సిద్ధమైంది. అఖిల్ సత్యన్ దర్శకత్వంలో గతేడాది డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కేవలం 10 రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన ఈ మూవీ, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 145 కోట్లకు పైగా వసూళ్లను సాధించి మలయాళ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఒక నాస్తికుడైన బ్రాహ్మణ యువకుడికి, ఒక ‘జెన్-జెడ్’ దయ్యానికి మధ్య సాగే ఆసక్తికర ప్రయాణంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తోంది.
థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘జియో హాట్‌స్టార్’ కైవసం చేసుకుంది. జనవరి 30 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రాబోతుంది. ‘ప్రేమమ్’ వంటి భారీ హిట్ తర్వాత సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నివిన్ పౌలీకి ఈ సినిమా గట్టి కంబ్యాక్ ఇచ్చిందని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. ఇందులో రియా షిబు, అజు వర్గీస్ కీలక పాత్రలు పోషించగా, జస్టిన్ ప్రభాకరన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.