Sarpatta Parambarai | తమిళ దర్శకుడు పా. రంజిత్ కెరీర్లో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలలో సర్పట్ట పరంబారైకి ఒకటి. ఆర్య కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో దుషారా విజయన్ కథానాయికగా నటించింది. పశుపతి కీలక పాత్రలో నటించాడు. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం లాక్డౌన్ టైంలో నేరుగా ఓటీటీలో విడుదలై సూపర్ హిట్‌ను అందుకుంది. ఈ సినిమా కోసమే ఆర్య తన బాడీని కూడా మార్చుకున్నాడు. అయితే ఈ సినిమా వచ్చిన దాదాపు 4 ఏండ్ల తర్వాత మళ్లీ దీనికి సీక్వెల్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని తాజాగా నటుడు ఆర్య ఒక వేడుకలో వెల్లడించాడు.
ఆర్య మాట్లాడుతూ.. సర్పట్ట పరంబారైకి సీక్వెల్ రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ ఆగష్టులో స్టార్ట్ కాబోతుంది. ప్రస్తుతం పా.రంజిత్ వెట్టువం (Vettuvam) సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ అయ్యాకా సర్పట్ట పరంబారై సీక్వెల్ స్టార్ట్ అవుతుందంటూ ఆర్య చెప్పుకోచ్చాడు.
కథ విషయానికొస్తే.. 1970ల నేపథ్యంలో ఉత్తర చెన్నైలోని రెండు వర్గాలైన ఇడియప్ప పరంబరై మరియు సర్పట్ట పరంబరై మధ్య జరిగిన ఘర్షణల చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. ఈ ప్రాంతంలోని బాక్సింగ్ సంస్కృతి మరియు దాని సంబంధిత రాజకీయాలను కూడా ఇది ప్రదర్శిస్తుంది. చెన్నైలోని ఓ హార్బర్లో హమాలి కూలీగా పనిచేసే సమర అలియాస్ సామ్రాజ్యం(ఆర్య) అనే యువకుడి కథ. చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే ప్రాణం. స్కూల్‌కు వెళ్లకుండా బాక్సింగ్ పోటీలు చూసేవాడు. తల్లి భాగ్యం(అనుపమ కుమార్)కు ఇది నచ్చకపోయినా, ఆమె కళ్లు గప్పి మరీ వెళ్లేవాడు. ఒకసారి సర్పట్టా, ఇడియప్ప వర్గాల మధ్య జరిగిన బాక్సింగ్‌లో సర్పట్టా ఓడిపోతుంది. దీంతో సర్పట్టా తరపున బరిలోకి దిగి గెలుస్తానని సమర సవాల్ చేస్తాడు. తల్లి వద్దంటున్నా వినకుండా ఇడియప్ప బాక్సర్ వేటపులి(జాన్ కొక్కెన్)తో పోటీకి సిద్ధమవుతాడు. సమర బాక్సర్ కావడానికి తల్లికి ఎందుకు ఇష్టం లేదు? బరిలో అతడికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? గురువు రంగా కోసం ఏం చేశాడు? వేటపులిని ఓడించాడా లేదా అనేది మిగతా కథ.