Sarangapani Jathakam | సకుటుంబంగా చూడదగ్గ సినిమాలు నిర్మించడంలో శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్, రూపొందించడంలో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సిద్ధహస్తులు. ఈ కారణంచేతే.. వీరిద్దరి కలయికలో వస్తున్న ‘సారంగపాణి జాతకం’ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ప్రియదర్శి, రూప కొడవాయూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం సమ్మర్లో విడుదల కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ‘కుటుంబ సమేతంగా చూడదగ్గ పరిపూర్ణ హాస్యరసచిత్రం మా ‘సారంగపాణి జాతకం’. అందుకే వేసవి సెలవల్లో విడుదల చేస్తున్నాం.
ప్రచార చిత్రాల్లో సారంగపాణి ప్రపంచం ఎలా ఉంటుందో ఇప్పటికే పరిచయం చేశాం. మనిషి భవిష్యత్తు చేతి రేఖల్లో ఉంటుందా? చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా. రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునే సినిమా ఇది. పోస్ట్ ప్రొడక్షన్ తుదిదశకు చేరుకుంది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం.’ అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. నరేష్ వీకే, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, వైవా హర్ష, శివన్నారాయణ, అశోక్‌కుమార్, రూపలక్ష్మి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగర్.