నితిన్ హీరోగా శ్రీరామ్‌వేణు దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం ‘తమ్ముడు’. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రధారులు. ఈ నెల 4న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్‌ని వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే సోమవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ అంతా సందడి చేశారు. ఈ ఈవెంట్లోనే థియేట్రికల్ ట్రైలర్‌ని కూడా లాంచ్ చేశారు. ఇదిలావుంటే.. మంగళవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర కథానాయికల్లో ఒకరైన సప్తమి గౌడ విలేకరులతో ముచ్చటించారు. ‘కాంతార’ తర్వాత దర్శకుడు శ్రీరామ్‌వేణు నుంచి ‘తమ్ముడు’ మూవీ కోసం కాల్ వచ్చిందని, హైదరాబాద్ వచ్చి లుక్ టెస్ట్‌లో ఓకే అయ్యాక కథ, డైలాగ్ వెర్షన్ చెప్పారని సప్తమీ గౌడ తెలిపారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఇందులో మా ఊరి పేరు అంబరగొడుగు. నా పేరు రత్న. పవన్‌కల్యాణ్ అభిమానిని. సీరియస్ సబ్జెక్ట్ అయిన ‘తమ్ముడు’ సినిమాలో నా పాత్ర వల్ల ఫన్ క్రియేట్ అవుతుంది. లయ, నితిన్ కొన్ని పరిస్థితుల కారణంగా మా ఊరు వస్తారు. వారి ప్రయాణంలో నా పాత్ర ఎలా భాగమైంది అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం.’ అని సప్తమి గౌడ చెప్పారు. ‘లయ మేడమ్, దిత్య, వర్ష, స్వసిక, నేను.. మా అయిదుగురి పాత్రలు పవర్‌ఫుల్‌గా ఉంటాయి. మాకు ఫైట్ సీక్వెన్స్ కూడా ఉన్నాయి. మహిళలంతా గర్వపడేలా మా పాత్రల్ని మలిచారు దర్శకుడు శ్రీరామ్‌వేణు. ఇందులో నితిన్‌తో నాకు మంచి లవ్‌ట్రాక్ ఉంది. మా ఇద్దరి పాత్రలు కలవాలని ప్రేక్షకులు కూడా కోరుకుంటారు’ అని సప్తమి గౌడ చెప్పింది.