Sapthagiri In Salaar Movie | ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో పెరిగింది. ఈయన నుండి సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులే కాదు, ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. ప్రభాస్ కూడా ఓకే జానర్లో సినిమాలు చేయకుండా ఆడియెన్స్ రుచికి తగ్గుట్టు కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. ఇటీవలే రాధేశ్యామ్‌తో తీవ్రంగా నిరాశపరిచిన ప్రభాస్ తన తదుపరి సినిమాలపై పూర్తి దృష్టిని పెట్టాడు. ప్రస్తుతం ఈయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. షూటింగ్ ప్రారంభించి నెలలు గడిచిన ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ గాని, టీజర్ గాని విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో అభిమానులు ఒక మేజర్ అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అయితే మేకర్స్ నుండి ఎలాంటి అప్డేట్లు రాకపోయినా, సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు సినిమాకు సంబంధించిన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది.ఈ చిత్రంలో కమెడియన్ సప్తగిరి కీలక పాత్రలో నటించనున్నాడట. అంతేకాకుండా ఈ చిత్రానికి సప్తగిరి 30రోజుల కాల్షీట్లు ఇచ్చాడట. దీన్ని బట్టి చూస్తే చాలా కాలం తర్వాత సప్తగిరికి లెంగ్త్ ఉన్న రోల్ పడనుంది. మంగళవారం హైదరాబాద్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో మేకర్స్ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నారట. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. 60శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘తన్హాజీ’ ఫేం ఓ రౌత్ తెరకెక్కించాడు. దీనితో పాటుగా నాగ్ అశ్విన్‌తో ‘ప్రాజెక్ట్-K’ చిత్రాన్ని చేస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ సినిమాగా ఈ చిత్రాన్ని అశ్వినీదత్ రూపొందిస్తున్నాడు. వీటితో పాటుగా సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ చిత్రాన్ని చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.