అగ్ర నటుడు వెంకటేష్ నటించిన ప్రెస్టీజియస్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలు. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 14 విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన రెండు పాటలు శ్రోతల్ని విశేషంగా అలరిస్తున్నాయని మేకర్స్ చెబుతున్నారు. ముఖ్యంగా భాస్కరభట్ల సాహిత్యం అందించగా, భీమ్స్ సిసిరోలియో స్వర రచనలో రమణ గోగుల, మధుప్రియ కలిసి ఆలపించిన ‘గోదారి గట్టుమీద రామసిలకవే..’
పాట విడుదలైన మూడు వారాల్లోనే 50 మిలియన్ వ్యూస్‌ను రీచ్ అయ్యి, సీనియర్ హీరోల సినిమాల్లో రికార్డుగా నిలిచింది. అంతేకాక సోషల్‌మీడియాలో సంచలనంగా మారింది. రీసెంట్గా విడుదలైన రెండో పాట ‘మీనూ..’ కూడా పెద్ద హిట్ సాంగ్‌గా నిలిచిందని, ఈ నెల 30న వెంకటేష్ స్వయంగా ఆలపించిన పొంగల్ స్పెషల్ సాంగ్ విడుదల కానున్నదని మేకర్స్ తెలిపారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే.