Sandhya Theatre | హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో టాలీవుడ్ సినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. జూన్ 22న సోమవారం వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో అల్లు అర్జున్ను 11వ నిందితుడిగా చిక్కడపల్లి పోలీసులు చేర్చారు. సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని 1 నుంచి 10వ నిందితులుగా పేర్కొన్నారు. మొత్తం 19 మందికి కోర్టు సమన్లు జారీ చేయగా, 23 మందిపై ఇప్పటికే పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.
2024 డిసెంబర్ 4న సంధ్య థియేటర్లో ‘పుష్ప 2’ ప్రీమియర్ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ లీగల్ టీమ్ స్పందిస్తూ, సోమవారం జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ విషయంపై త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తాం అని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వివిధ వ్యక్తులు, సంస్థల పాత్రలు, బాధ్యతలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సోమవారం జరగనున్న విచారణ ఈ కేసులో కీలక పరిణామంగా మారనుంది.