సంపూర్ణేష్‌బాబు, అద్వితిశెట్టి జంటగా నటిస్తున్న ‘మిస్టర్ బెగ్గర్’ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వడ్ల జనార్ధన్ దర్శకుడు. గురురాజ్, కార్తిక్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నటుడు సత్యప్రకాష్ క్లాప్‌నివ్వగా, రాజు కెమెరా స్విఛాన్చేశారు. వి. సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ ‘గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగే వినోదాత్మక చిత్రమిది. ఓ బిచ్చగాడి జీవనగమనంలో చోటుచేసుకున్న సంఘటనలు నవ్విస్తాయి’ అని అన్నారు. సరదాగా సాగే కుటుంబకథా చిత్రమిదని, సంపూర్ణేష్‌బాబు శైలి కామెడీతో అలరిస్తుందని దర్శకుడు చెప్పారు. హీరో, విలన్ పాత్రలు పోటాపోటీగా ఉంటాయని నిర్మాత పేర్కొన్నారు. భద్ర అనే ప్రతినాయకుడిగా తాను నటిస్తున్నానని సత్యప్రకాష్ తెలిపారు. ఆలీ, బాబుమోహన్, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: పీఆర్, సినిమాటోగ్రఫీ: ఫణీంద్రవర్మ అల్లూరి.