అగ్ర కథానాయిక సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’. సమంతతో సూపర్‌హిట్ ‘ఓ బేబీ’ చిత్రాన్ని తెరకెక్కించిన నందినీరెడ్డి ఈ చిత్రానికి దర్శకురాలు కావడం విశేషం. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరులతో కలిసి సమంత నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా టీజర్ ట్రైలర్‌ను ఈ నెల 9న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది.
ఈ టీజర్ ట్రైలర్ ప్రేక్షకులకు ఉద్వేగపూరితమైన అనుభూతిని ఇవ్వనుందని ఈ సందర్భంగా ప్రకటనలో చిత్రబృందం పేర్కొన్నది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో సమంత సీరియస్ లుక్‌లో కనిపించారు. ఆమె పాత్రలోని ఇంటెన్సిటీని ఈ స్టిల్ ఆవిష్కరించింది. దిగంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గౌతమి, మంజూషా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథనం, మాటలు: వసంత్ మారిన్గంటి, కెమెరా: ఓం ప్రకాశ్, సంగీతం: సంతోష్ నారాయణ్.