తారాగణం: సమంత, దేవ్‌మోహన్, మోహన్‌బాబు, ప్రకాష్‌రాజ్, గౌతమి, అల్లు అర్హ తదితరులు
సినిమాటోగ్రఫీ: శేఖర్ వి జోసెఫ్
సంగీతం: మణిశర్మ
మాటలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాణ సంస్థ: గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గుణశేఖర్
మహాకవి కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ భారతీయ సాహిత్యంలో అజరామరమైన ప్రేమ కావ్యంగా నిలిచిపోయింది. దుష్యంతుడు, శకుంతల ప్రణయగాథను అద్భుతరీతిలో అక్షరీకరించింది. భారతీయులందరికి సుపరిచితమైన ఈ పౌరాణిక గాథను దర్శకుడు గుణశేఖర్ (Guna Sekhar) వెండితెరపై దృశ్యమానం చేశారు. ‘రుద్రమదేవి’ వంటి చారిత్రక చిత్రం తర్వాత సుదీర్ఘ విరామాన్ని తీసుకొని గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం (Shaakuntalam) సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. అగ్ర కథానాయిక సమంత (Samantha) కెరీర్లో తొలిసారి పౌరాణిక కథలో నటించడం కూడా సినిమాపై హైప్‌కు కారణమైంది. ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం…
కథ గురించి..
విశ్వామిత్రుడి తపోభంగం చేయడానికి భూలోకానికి చేరుకుంటుంది మేనక. ఆమె అద్భుత సౌందర్యాన్ని చూసి మోహ వివశుడవుతాడు విశ్వామిత్రుడు. ఇద్దరు శారీరకంగా దగ్గరవుతారు. ఫలితంగా ఓ ఆడబిడ్డకు జన్మనిస్తుంది మేనక. అయితే నరుడి వల్ల కలిగిన ఆ బిడ్డకు దేవలోకంలో ప్రవేశం లభించదు. దాంతో ఆ బిడ్డను భూలోకంలోనే వదిలిపెట్టి దేవలోకం వెళ్లిపోతుంది మేనక. అనాథయైన ఆ చిన్నారిని శాకుంతలములు అనే పక్షులు రక్షించి కణ్వాశ్రమంలో విడిచిపెడతాయి. ఆ చిన్నారికి శకుంతల (సమంత) అని నామకరణం చేస్తాడు కణ్వమహర్షి (సచిన్ ఖడేకర్). కొంతకాలం గడిచాక హస్తినాపురానికి రాజైన దుష్యంతుడు (దేవ్‌మోహన్) వేట నిమిత్తం కణ్వాశ్రమం దగ్గరకు వస్తాడు. శకుంతల అందచందాలను చూసి ప్రేమలో పడతాడు. ఇద్దరూ గాంధర్వ వివాహంతో ఒక్కటవుతారు.
Shaakuntalam1
శకుంతలను మహారాణిగా ప్రజలకు పరిచయం చేస్తానని వాగ్దానం చేసిన దుష్యంతుడు తన గుర్తుగా ఆమెకు ఓ ఉంగరం ఇచ్చి హస్తినాపురం తిరిగివెళతాడు. కొంతకాలానికి గర్భం దాల్చిన శకుంతల దుష్యంతుడి రాకకోసం నిరీక్షిస్తుంటుంది. అతను ఇక రాలేడని భావించిన శకుంతల తానే దుష్యంతుడి రాజ్యానికి వెళ్తుంది. అక్కడ ఆమెకు నిండు సభలో అవమానం జరుగుతుంది. శకుంతల ఎవరో తనకు తెలియదని చెబుతాడు దుష్యంతుడు. అతనిచ్చిన ఉంగరాన్ని శకుంతల పోగొట్టుకోవడంతో రుజువు చేసే సాక్ష్యాలేవి కనిపించవు. మహారాజు పేరు ప్రతిష్టల్ని భంగం చేయడానికి శకుంతల కుట్ర పన్నిందని సభికులు ఆరోపణలు చేస్తారు. అసలు శకుంతలను దుష్యంతుడు మరచిపోవడానికి కారణమేమిటి? చివరకు వీరి ప్రణయగాథ ఏ మలుపులు తీసుకుంది? అన్నదే మిగతా చిత్ర కథ..
కథా విశ్లేషణ…
మహాభారతం ఆదిపర్వంలోని ఈ అద్భుత ప్రణయగాథను తనదైన సృజనాత్మకత, సాంకేతిక హంగులు జోడించి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు గుణశేఖర్. అయితే ఈ ప్రబంధ కావ్యం తాలూకు అందమైన వర్ణనల్ని, కాళిదాసు కల్పనా శక్తిని, ప్రేమకథలోని గాఢతను హృద్యంగా దృశ్యమానం చేయడానికి దర్శకుడు గుణశేఖర్ చేసిన ప్రయత్నం అభినందనీయం. అయితే అందుకు ఆయన చేసిన కసరత్తులు సరిపోలేదనిపించింది. సుదీర్ఘ కావ్యాన్ని రెండున్నర గంటల వ్యవధిలో ప్రేక్షకుల్ని కట్టిపడేసే రీతిలో తెరపైకి తీసుకురావడం అంత సులభం కాదు. సాంకేతిక హంగులు తెరపై విజువల్ గ్రాండియర్‌ను తీసుకురావడానికి దోహదం చేస్తాయి కానీ..కథలో సంఘర్షణ లేకుంటే అంతా వృథా ప్రయాసే అవుతుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. అభిజ్ఞాన శాకుంతలం వంటి విస్త్రృత పరిధి ఉన్న కావ్యాన్ని తెరపైకి తీసుకొస్తున్నప్పుడు సన్నివేశాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి. ప్రేక్షకులకు ఏది అవసరమో అనే జడ్జిమెంట్ ఉండాలి. ఈ విషయంలో గుణశేఖర్ కాస్త తడబడ్డారు.
చిన్నారి శాకుంతలం ఎపిసోడ్‌తో కథను ఆసక్తికరంగా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కణ్వాశ్రమం విజువల్స్‌ను అందంగా చూపెట్టారు. బాల్యం తర్వాత దుష్యంతుడి ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. అతన్ని పరిచయం చేసే ఘట్టాలు ఆకట్టుకునేలా ఉన్నా…విజువల్స్ మాత్రం తేలిపోయాయి. ఈ కథలో కీలకమైన శకుంతల, దుష్యంతుడి ప్రేమ ఘట్టాన్ని సాదాసీదాగా తీశారనిపించింది. వారి ప్రేమ తాలూకు భావోద్వేగాలతో ప్రేక్షకులు ఏమాత్రం కనెక్ట్ కాలేకపోతారు. దుర్వాస మునిగా మోహన్‌బాబు రంగప్రవేశంతో కథ కీలక మలుపు తీసుకుంటుంది. సినిమా ప్రథమార్థాన్ని సాగతీశారనే భావన కలుగుతుంది. ద్వితీయార్థంలో శకుంతలకు నిండు సభలో అవమానం జరగడం, ఆమెను ప్రజలు రాళ్లతో కొట్టి చంపే ప్రయత్నం చేసే సన్నివేశాలు ఉత్కంఠను పంచుతాయి. అయితే శకుంతల, దుష్యంతుడు తిరిగి కలుసుకునే క్రమంలో వచ్చే సన్నివేశాల్ని అంత ఆసక్తికరంగా ఆవిష్కరించలేకపోయారు. అసురులు, దేవతలు చేసిన యుద్ధం కూడా చాలా కృత్రిమంగా అనిపిస్తుంది.క్లైమాక్స్‌లో భరతుడిగా అల్లు అర్హ ఎంట్రీ ఆకట్టుకుంటుంది. దుష్యంతుడితో ఆమె చేసే సంవాదం బాగుంది.
Shaakuntalam
నటీనటుల పర్ఫార్మెన్స్..
టైటిల్ పాత్రలో సమంత అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించింది. భావోద్వేగభరిత సన్నివేశాల్లో మెప్పించింది. దుష్యంతుడి పాత్రకు దేవ్‌మోహన్ బాగానే కుదిరినా..నటనలో మాత్రం పరిణితి కనిపించలేదు. ఆ పాత్రకు మంచి పేరున్న నటుణ్ణి తీసుకుంటే బాగుండేదనిపిస్తుంది. దుర్వాస మహామునిగా మోహన్‌బాబు తనదైన నటనతో మెప్పించాడు. అల్లు అర్హ చలాకీగా కనిపించింది. అనన్య, మధుబాల, సచిన్ ఖేడేకర్, గౌతమి, శివబాలాజీ పరిధుల మేరకు మెప్పించారు. విజువల్ ఎఫెక్ట్స్, త్రీడీ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు ప్రధానాకర్షణగా నిలిచింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
సమంత నటన, మణిశర్మ సంగీతం, క్లైమాక్స్ ఘట్టాలు
మైనస్ పాయింట్స్: సాగతీతగా అనిపించే ప్రథమార్థం, మెప్పించని త్రీడీ హంగులు, కథలో సంఘర్షణ లోపించడం
రేటింగ్: 2.5/5