ఏ మాయ చేశావే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమంత ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. పెళ్లైనప్పటికీ సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఒకవైపు సినిమాలు మరో వైపు వెబ్ సిరీస్‌లు ఇంకో వైపు సోషల్ మీడియాతో తెగ సందడి చేస్తుంది. చేతి నిండా ప్రాజెక్టులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. అక్కినేని సమంత సోషల్ మీడియాలో కూడా చాలా కాలంగా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోవర్లను పెంచుకుంటోంది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు పదేళ్లుగా ఉన్న సమంత తన అందంతో పాటు అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంటుంది. పెళ్లి తర్వాత ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్న సమంత ఇటీవల ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో నెగిటివ్ పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇక శాకుంతలం చిత్రం ద్వారా తొలిసారి కెరీర్లో చారిత్రాత్మక చిత్రం చేస్తుంది. ఇటీవల ఈ షూటింగ్ పూర్తి చేసిన సామ్ ప్రస్తుతం కాత్తు వాక్కుల రెండు కాదల్ సినిమాలో నటిస్తుంది.
అయితే శాకుంతలం, కాత్తు వాక్కుల రెండు కాదల్ సినిమాల రిలీజ్ తర్వాత సమంత సినిమాలకు బ్రేక్ తీసుకోనుందని సమాచారం. దాదాపు దశాబ్ధ కాలంగా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సమంత కొద్ది రోజులు విలువైన సమయాన్ని కుటుంబానికి కేటాయించాలని అనుకుంటుందట. చూస్తుంటే సమంత త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుందనే అనుమానాలు కలుగుతున్నాయి.