Samantha | వర్కవుట్లతో శారీరకంగా.. జీవితంలో ఎదురైన అనుభవాలతో మానసికంగా స్ట్రాంగ్ అయ్యింది సమంత. ఈ మధ్య కొన్ని వేదికలపై ఆమె మూర్తీభవించిన ఆత్మవిశ్వాసంతో కనిపించింది. ఇన్స్టా ద్వారా తన ఫొటోలతో సందడి చేయడమేకాక, అప్పుడప్పుడు సాటి స్త్రీలను చైతన్యవంతుల్ని చేసేలా పోస్టులు పెడుతూ తనలోని స్త్రీవాదాన్ని చాటుతుండటం సామ్ స్పెషాలిటీ.
తాజాగా ఇన్స్టాలో తను ఓ పద్యాన్ని షేర్ చేసింది. ‘మిమ్మల్ని అందరూ నిందిస్తున్నప్పుడు.. మీరు తలెత్తుకొని నిలబడితే.. పురుషులంతా మిమ్మల్ని అవమానించినప్పుడు.. మిమ్మల్ని మీరు నమ్మితే..’ అంటూ ఈ పద్యం మొదలైంది.
‘రిస్క్ చేసి ఓడిపోయావా!?.. కొత్త ప్రయాణం మొదలుపెట్టు. అంతేకానీ ఓటమి గురించి ఆలోచిస్తూ కూర్చోకు. హృదయాన్ని కఠినం చేసుకో.. సుదీర్ఘ ప్రయాణంకై ధైర్యంగా కదులు.. నీ దగ్గర ఏమీ లేనప్పుడు సంకల్పమే నిన్ను నడిపిస్తుంది. అప్పుడు నిన్ను నిందించేవారికి సైతం సమాధానం చెప్పొచ్చు.’ అంటూ సాగిన ఈ పద్యాన్ని పోస్ట్ చేసి, దీన్ని అందరితో పంచుకోవాలని ఉందని క్యాప్షన్ జతచేసింది సామ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పద్యం బాగా వైరల్ అవుతున్నది.