Samantha | సమంత ఓ సంచలనాత్మక మహిళ. ఏ విషయాన్నయినా కుండ బద్దలు కొట్టి చెప్పటం ఆమె శైలి. స్త్రీత్వాన్ని అమితంగా గౌరవించడం.. దానికితోడు ఆత్మాభిమానం.. ఈ రెండూ ఆమెను నిరంతరం వార్తల్లో వ్యక్తిగా నిలబెడుతుంటాయి. విడిపోయిన తర్వాత, మాజీ భాగస్వామి గురించి మాట్లాడటానికి ఎక్కువమంది ఇష్టపడరు. కానీ సమంత నిర్మొహమాటంగా మాట్లాడేస్తుంది. ఆ మధ్య ‘సిటాడెల్: హనీ బన్నీ’ ప్రొమోషన్స్లో.. ‘అవసరం లేకపోయినా అత్యధిక మొత్తంలో దేనికోసం ఖర్చుపెట్టారు?’ అనే ప్రశ్న తన కోస్టార్ వరుణ్ ధావన్ రూపంలో సామ్‌కి ఎదురవ్వగా.. ‘నా మాజీకి ఇచ్చిన ఖరీదైన కానుకలు..’ అంటూ సూటిగా బదులిచ్చింది సమంత. ‘ఎతుంటుందేంటి?’ అని వరుణ్ రెట్టించి అడిగితే.. ‘కాస్త ఎక్కువే..’ అంటూ నవ్వేసింది సామ్.
కరణ్‌జోహార్ టాక్ షోలో కూడా ‘మాజీ, నేనూ ఒకే గదిలో ఉన్నప్పుడూ.. మా చేరువలో కత్తులు ఉండకపోవడం మంచిదైంది..’ అని ఓపెన్‌గా చెప్పేసింది. ఇదిలావుంటే.. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు.. ‘రిలేషన్షిప్ నుంచి బయటకొచ్చారు కదా.. ఒంటరి జీవితం ఎలావుంది?’ అనే ప్రశ్న ఎదురైంది. ‘ఆ ప్రభావం నుంచి బయటకు రావడానికి చాలా శ్రమించా.’ అని సింపుల్‌గా సమాధానమిచ్చింది సమంత. మీ మాజీ భాగస్వామి కొత్త బంధంలోకి అడుగుపెట్టినందుకు ఆసూయగా లేదా? అనడగ్గా.. ‘నా జీవితంలో అసూయ అనేదానికి తావే లేదు.. ఇవ్వను కూడా. అన్ని చెడులకూ మూలం అసూయే.. అది నేను ప్రగాఢంగా నమ్ముతా.. నాది కాని దాని గురించి నేను అస్సలు ఆలోచించను’ అని తేల్చిచెప్పేసింది సమంత.