అగ్ర నటి సమంత పితృవియోగానికి గురయ్యారు. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం చెన్నైలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. జోసెఫ్ ప్రభు తెలుగు ఆంగ్లో ఇండియన్ కుటుంబానికి చెందినవారు. 1986లో నీనెట్ ప్రభుతో ఆయనకు వివాహం జరిగింది. 87లో వారికి సమంత జన్మించారు. భార్య నీనెట్ ప్రభుతో కలిసి ఆయన చెన్నైలోనే నివాసం ఉంటున్నారు. జీవితంలోని ప్రతి మలుపులో తన తండ్రి తనకు తోడుగా నిలిచారని, తన ఎదుగుదలలో ఆయన పాత్ర కీలకమని పలు ఇంటర్వ్యూల్లో సమంత పేర్కొన్న విషయం విదితమే. తండ్రి మరణంతో సమంత తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ‘మనం మళ్లీ కలిసే వరకు.. నాన్న..’ అంటూ హృదయం కదిలించే క్యాప్షన్‌తో ఓ ఫొటోను సమంత తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ వార్త తెలియడంతో అభిమానులు, సినీ ప్రముఖులు సమంతకు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.