Battle of Galwan | బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ (Battle of Galwan) టీజర్ విడుదలైనప్పటి నుంచీ సరిహద్దు అవతల చైనాలో ప్రకంపనలు మొదలయ్యాయి. డిసెంబర్ 27న సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుండటంతో, చైనా అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ ఈ సినిమాపై అక్కసు వెళ్లగక్కింది. భారత సైనికుల వీరత్వాన్ని చాటిచెప్పే ఈ చిత్రాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో చైనా మీడియా తన సంపాదకీయంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా కాదని, కేవలం భారతీయుల్లో జాతీయవాదాన్ని రెచ్చగొట్టడానికి రూపొందించిన నేషనలిస్టిక్ మెలోడ్రామా అని చైనా కొట్టిపారేసింది. అంతేగాకుండా 2020 గల్వాన్ ఘర్షణల్లో భారత సైనికులే చొరబాటుకు పాల్పడ్డారని బుకాయిస్తూ.. సినిమాలో తమ సైన్యాన్ని విలన్లుగా చూపించడం సరికాదని చైనా వాదిస్తోంది. అలాగే అంతర్జాతీయ వేదికలపై చైనా సైనికుల మరణాల సంఖ్య గురించి భారత్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని గ్లోబల్ టైమ్స్ ఆరోపించింది.
2020లో జరిగిన గల్వాన్ ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన విషయం విదితమే. అయితే చైనా మాత్రం తన వైపు జరిగిన భారీ ప్రాణనష్టాన్ని దాచిపెట్టి, కేవలం నలుగురు సైనికులు మాత్రమే మరణించారని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ అంతర్జాతీయ నివేదికలు చైనా వైపు భారీగా సైనికులు హతమయ్యారని స్పష్టం చేశాయి. అయితే ఈ సంఘటనల ఆధారంగానే చిత్రం రాబోతుంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, గల్వాన్ పోరాటంలో అసువులు బాసిన తెలంగాణ ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది (అయితే దీనిపై పూర్తి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది). ఈ సినిమాకు అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తుండగా.. సల్మాన్ ఖాన్ సరసన చిత్రాంగద సింగ్ కథానాయికగా నటిస్తోంది. హిమేష్ రేషమియా సంగీతం అందించబోతున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.