Salman Khan | బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వంశీ పైడిపల్లి బాలీవుడ్లో తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సల్మాన్ ఖాన్ కెరీర్లోనూ ఈ ప్రాజెక్ట్ అత్యంత భారీ చిత్రంగా రూపొందుతోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సల్మాన్ ఖాన్‌కు జోడీగా లేడీ సూపర్‌స్టార్ నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ సినీ మ్యాగజైన్ ఫిల్మ్‌ఫేర్ కథనం ప్రకారం ఈ చిత్రానికి ‘మాన్స్టర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ టైటిల్‌పై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే సల్మాన్ ఖాన్ ఇమేజ్‌కు, సినిమాలోని యాక్షన్ నేపథ్యానికి ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం కూడా బయటకు వచ్చింది. యాక్షన్ సన్నివేశాల కోసం సల్మాన్ ఖాన్‌కు బాడీ డబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తికి ఇటీవల గుండెపోటు వచ్చినట్లు సమాచారం. దీంతో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఏర్పడింది.
అయితే షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో సల్మాన్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై తనకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్‌లను వీలైనంత వరకు స్వయంగా చేయాలని సల్మాన్ నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్‌ఫేర్ కథనం పేర్కొంది. షూటింగ్ షెడ్యూల్‌కు ఎలాంటి అంతరాయం కలగకూడదని సల్మాన్ భావిస్తున్నారని సమాచారం. అందుకే బాడీ డబుల్‌పై ఆధారపడకుండా, తన పాత్రకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల్లో స్వయంగా పాల్గొనేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వంశీ పైడిపల్లి తొలిసారి బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ వంటి మెగాస్టార్‌తో సినిమా చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది. ఈ భారీ చిత్రాన్ని 2027 ఈద్ సందర్భంగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.