Saiyami Kher | కాస్టింగ్ కౌచ్ సినీ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో పలువురు నటీమణులు తాము క్యాస్టింగ్ కౌచ్ బారినపడ్డామంటూ వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ సైతం క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది. టాలీవుడ్లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ప్రముఖ నటి సయామీ ఖేర్ కీలక విషయాలను బయటపెట్టింది. టాలీవుడ్‌కు చెందిన ఓ లేడి ఏజెంట్ అవకాశాల కోసం తనను ‘సర్దుకుపోవాలి’ అని చెప్పిందని తెలిపింది. తాను ఎలాంటి పనులకు దూరంగా ఉంటానని.. తనకు కొన్ని పరిమితులు ఉన్నాయంటూ తేల్చి చెప్పినట్లు చెప్పింది.
సయామీ ఖేర్ 2015లో ‘రేయ్’ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత 2016లో మిర్జియాతో బాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత మౌళి, చోక్డ్, వైల్డ్‌డాగ్, ఘూమర్ చిత్రాలతో పాటు పలు వెబ్‌సిరీస్‌లలోనూ నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనకు వచ్చిన అవకాశాలతో సంతృప్తిగానే ఉన్నట్లు చెప్పింది. కెరియర్ ప్రారంభంలో జరిగిన ఘటన మాత్రం తనను తీవ్రంగానే బాధించిందని ఆవేదన వ్యక్తం చేసింది. కెరియర్ మొదట్లో ఓ తెలుగు సినిమా ఏజెంట్ తనను కలిశారని.. మూవీ ఛాన్స్‌ల కోసం కొన్ని విషయాల్లో సర్దుకుపోవాల్సి ఉంటుందని అన్నారని.. ఓ మహిళ అయి ఉండగా.. సాటి మహిళతో అలా మాట్లాడడం తనను షాక్‌కు గురి చేసిందని చెప్పింది.
మొదట తాను మాత్రం ఆమె మాటలు అర్థం కానట్లుగా నటించానని.. తరచూ అదే విషయం చెబుతుండడంతో ‘క్షమించండి. మీరు నన్ను ఆ మార్గంలో వెళ్లాలని సూచిస్తున్నారని అనుకుంటున్నాను. నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటిని నేను ఎప్పటికీ దాటను’ అని తిరస్కరించినట్లు పేర్కొన్నారు. తన కెరియర్లో ఓ మహిళ నుంచే ఇలాంటి ప్రతిపాదన రావడం అదే తొలిసారి, చివరిసారి అని చెప్పింది. ఇదిలా ఉండగా.. సయామీ ఖేర్ చివరిసారిగా సన్నీ డియోల్ హీరోగా.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘జాట్’మూవీలో నటించింది. ఈ మూవీలో ఎస్ఐ విజయలక్ష్మి పాత్రలో నటించి ప్రశంసలు పొందింది.