ఆదివారం 29 నవంబర్ 2020
Cinema - Oct 31, 2020 , 01:53:32

పవన్‌కు జోడీగా సాయిపల్లవి?

పవన్‌కు జోడీగా సాయిపల్లవి?

పాత్రలపరంగా సవాళ్లకు సిద్ధంగా ఉంటుంది తమిళ సోయగం సాయిపల్లవి. ఎలాంటి కథాంశాన్ని ఎంచుకున్నా తనదైన శైలి నటనతో మెప్పిస్తుంది. కేవలం అభినయపరంగానే కాకుండా అద్భుత నృత్యాలతో ఈ అమ్మడు అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంటుంది. తాజాగా ఆమె తెలుగులో ఓ భారీ సినిమాను అంగీకరించిందని సమాచారం. వివరాల్లోకి వెళితే...పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్న విషయం తెలిసిందే. సాగర్‌చంద్ర దర్శకత్వం వహించనున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌' రీమేక్‌గా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ శక్తివంతమైన పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన భార్య పాత్రలో సాయిపల్లవి నటించనుందని వార్తలొస్తున్నాయి. మలయాళ మాతృకలో పోలీస్‌ అధికారిగా బిజుమీనన్‌ నటించారు. ఆయన సతీమణిగా గౌరీనందా నటించింది. అభ్యుదయ భావాలు కలబోసిన యువతిగా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించింది గౌరీనందా. తెలుగు వెర్షన్‌లో ఆమె పాత్రకు సాయిపల్లవిని ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.