ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్నది. బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్అలీఖాన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్నది. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్‌లో తీర్చిదిద్దు తున్న భారీ సెట్లో పోరాట ఘట్టాలను తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్-సైఫ్అలీఖాన్ మధ్య వచ్చే ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు.
ఎన్టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ ఈ సినిమాపై అంచనాల్ని పెంచింది. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మృగాల్లాంటి మనుషుల బారి నుంచి తన వారిని రక్షించుకునే ధీరోదాత్తుడైన వ్యక్తిగా ఎన్టీఆర్ పాత్ర అత్యంత శక్తివంతంగా సాగుతుందని సమాచారం. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.