Sai Rajesh | టాలీవుడ్లో బేబి చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మూవీ మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్లో రీమేక్‌కి సిద్ధంగా ఉంది. బేబీని హిందీలో రీమేక్ చేయడం కోసం ప్రిపరేషన్ వర్క్ స్టార్ట్ చేశారు. అందులో హీరోగా ఇర్ఫాన్ ఖాన్ కొడుకు బాబిల్ ఖాన్ నటించాలి. అయితే ఇటీవల బాలీవుడ్ స్టార్స్ అనన్యా పాండే, సిద్ధార్థ్ చతుర్వేది తన పట్ల చాలా దురుసుగా ప్రవర్తించారని బాబిల్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి కొన్ని గంటల తర్వాత డీలీట్ చేశాడు.
కాని అప్పటికే ఆ వీడియో చాలా మందికి చేరింది. దీనిని పలువురు ఖండించారు. అనన్య, సిద్ధార్ధ్లని బాబిల్ అలా కామెంట్ చేయడం సాయి రాజేష్ కూడా ఖండించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఆన్లైన్ వేదికగా చాలా డిస్కషన్ నడిచింది. తనకు మద్దతు ఇచ్చిన వ్యక్తులను మాత్రమే మంచి వాళ్ళుగా, మిగతా వాళ్ళందరినీ మూర్ఖులుగా బాబిల్ ఖాన్ చూస్తున్నారని సాయి రాజేష్ కామెంట్ చేశారు. అతను సారీ చెప్పాలని కోరారు. సాయి రాజేష్ కోసం తన జీవితంలో రెండేళ్లు ఇచ్చానని, అతని పాత్రకు న్యాయం చేయడం కోసం చాలా కష్టపడ్డానని, ఈ ప్రయాణంలో తనకు వచ్చిన అవకాశాలు వదులుకున్నానని బాబిల్ తెలిపారు. సాయి రాజేష్ సర్కి, నాకు ఎంతో మంచి రిలేషన్ ఉంది.. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నాను.. మళ్లీ భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేస్తానని ఆశిస్తున్నాను.. ఈ ప్రాజెక్ట్‌ను ఆయన విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను అని బాబిల్ ఖాన్ పోస్ట్ చేశాడు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వాస్తవాన్ని తాను అంగీకరించక తప్పదని, కొన్ని రోజుల పాటు అతనితో ప్రిపరేషన్ వర్క్ చేశామని సాయి రాజేష్ అన్నారు. . తన హీరోని మిస్ అవుతున్నట్లు ఆయన వివరించారు. అయితే సెల్ఫ్ కేర్ ముఖ్యమని బాబిల్ ఖాన్ తీసుకున్న నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని ఆయన పేర్కొన్నారు. నా జీవితంలో నేను కలిసిన నటుల్లో బాబిల్ ఎంతో ప్రతిభ కలిగిన వ్యక్తి. త్వరలో అతనితో కలిసి మూవీ చేస్తానని సాయి రాజేష్ అన్నారు.