Sai Pallavi | తెరపై అద్భుతమైన ప్రతిభాపాటవాలతో మెస్మరైజ్ చేస్తుంది అగ్ర కథానాయిక సాయిపల్లవి. వ్యక్తిగత జీవితంలో కూడా చక్కటి వినయ విధేయలతో సున్నిత మనస్కురాలిగా కనిపిస్తుంది. అలాంటి సాయిపల్లవి తమిళ మీడియాలో వచ్చిన ఓ వార్తపై సోషల్‌మీడియా వేదికగా భగ్గుమంది. మరోసారి ఇలాంటి వార్తలు పునరావృతమైతే చూస్తూ ఊరుకునేది లేదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసింది.
ఈ భామకు అంతలా కోపం తెప్పించిన సంఘటన వివరాల్లోకి వెళితే.. హిందీ చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తూ సాయిపల్లవి ‘రామాయణ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రణబీర్‌కపూర్ రాముడి పాత్రధారి. ఈ సినిమా కోసం సాయిపల్లవి మాంసాహారాన్ని మానేసి పూర్తిగా శాఖాహారిగా మారిపోయిందని ప్రముఖ తమిళ వెబ్సైట్లో ఓ స్టోరీ రాశారు. స్వతహాగా సాయిపల్లవి శాఖాహారి. తాను జీవితాంతం వెజిటేరియన్‌గానే ఉంటానని, ఓ జీవి చనిపోతుంటే అస్సలు చూడలేనని అనేక సందర్భాల్లో చెప్పింది.
ఈ నేపథ్యంలో తమిళ వెబ్సైట్ రాసిన వార్తపై సాయిపల్లవి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ‘చాలాసార్లు ఇలాంటి కట్టుకథలు, తప్పుడు కథనాలపై మౌనంగా ఉన్నా. కానీ ఇవి ఆగేలా లేవు. ముఖ్యంగా నా సినిమాలకు సంబంధించి ప్రత్యేక సందర్భాలు, సంతోషకరమైన క్షణాల్లో ఇలాంటి తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నారు. మరోసారి ఇలాంటి గాసిప్స్, అవాస్తవాలు రాస్తే చూస్తూ ఊరుకోను. తప్పకుండా లీగల్ యాక్షన్ తీసుకుంటా’ అని సాయిపల్లవి తన పోస్ట్‌లో హెచ్చరించింది.