మెగా హీరో సాయిధరమ్ తేజ్ రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో తేజ్‌కి తీవ్ర గాయాలు కాగా, ఆయన 35 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. దసరా పండుగ రోజు తేజ్ డిశ్చార్జ్ కాగా, దీపావళి రోజు మెగా ఫ్యామిలీని కలిసాడు. చిరంజీవి ఇంట్లో జరిగిన వేడుకలలో పాల్గొన్న తేజ్ అందరు హీరోలతో కలిసి ఫొటోలకు ఫోజిచ్చారు. ఈ ఫొటోని చిరు సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌ని ఆనందపరచారు.
మెగాస్టార్ తన పోస్ట్‌లో అందరి ఆశీస్సులు, దీవెనలు ఫలించి సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ‘ మా కుటుంబ సభ్యులందరికీ ఇది నిజమైన పండుగ అని ట్వీటర్ వేదికగా ఫోటోను పోస్ట్ చేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవీ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ భుజంపై చేయి వేసి ఉండగా, పవన్ కల్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, పవన్ తనయుడు అకీరా నందన్‌లు ఉన్నారు.
అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకున్నాడు. మా కుటుంబసభ్యులందరికి ఇది నిజమైన పండుగ. @IamSaiDharamTej pic.twitter.com/DZOepq88ON
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 5, 2021
అయితే ప్రమాదం తర్వాత బయట కనిపించని సాయి ధరమ్ తేజ్ నేడు మీడియా ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. సాయి ధరమ్ నటించిన రిపబ్లిక్ చిత్రం నవంబర్ 26న జీ5 ఓటీటీ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్ కోసం చిత్ర బృందంతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నాడట తేజ్. ఇందులో ఆయన ఏయే విషయాలు చెబుతారా అని అందరు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. దేవాకట్ట దర్శకత్వం వహించిన రిపబ్లిక్ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించగా రమ్య కృష్ణ కీలక పాత్రలో నటించారు.