సినిమాలు తప్ప మరో ధ్యాస లేకుండా ముందుకు పోతున్నారు ఎన్టీఆర్. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆయన ‘దేవర’ చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి సినిమా చేసిన హీరోలకు ఆ వెరీ నెక్ట్స్ మూవీ అంటే గండమే. ఇప్పటివరకూ అలాగే జరిగింది కూడా. అయితే తారక్ ఆ గండాన్ని ఎట్టి పరిస్థితుల్లో అధిగమించాలనే కసితో ఉన్నారు. దర్శకుడు కొరటాల శివ కూడా ‘దేవర’గా మునుపెన్నడూ చూడని కొత్త ఎన్టీఆర్‌ని తెరపై ఆవిష్కరించేందుకు శాయశక్తులూ ఒడ్డుతున్నారనేది ఫిలిం నగర్ వర్గాల టాక్.
ఇదిలావుంటే.. ఆయన తర్వాతి సినిమా విషయంలోకూడా ఓ ఆసక్తికరమైన వార్త వెలుగుచూసింది. ‘దేవర‘ తర్వాత తారక్ చేసేది ప్రశాంత్‌నీల్ సినిమానే అని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన కేవలం రెండేరెండు సినిమాలకు దర్శకత్వం వహించిన ఓ యువ దర్శకుడికి ఓకే చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. అతనెవరో కాదు రాహుల్ సంకృత్యన్. టాక్సీవాలా, శ్యామ్‌సింగరాయ్ సినిమాలతో దర్శకునిగా మంచి గుర్తింపుతెచ్చుకున్న రాహుల్.. ఎన్టీఆర్ కోసం ఓ మంచి పీరియాడికల్ సబ్జెక్ట్‌ని సిద్ధం చేశారట. కథ నచ్చడంతో ‘దేవర’ తర్వాత వెంటనే ఈ సినిమా చేయాలని ఎన్టీఆర్ నిశ్చయించుకున్నారట. మైత్రీమూవీమేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్టు టాక్.